
స్నేహమంటే ఇదేరా..!
దివ్యాంగుడికి ట్రైసైకిల్ ఇప్పించిన స్నేహితులు
విజయనగరం కంటోన్మెంట్: ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహితుడు అన్న నానుడిని అక్షరాలా నిజం చేశారు ఓ దివ్యాంగుని స్నేహితులు. ఆ దివ్యాంగుడికి ట్రైసైకిల్ ఇచ్చేందుకు అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వారంతా చలించి దివ్యాంగుడైన స్నేహితుడితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి ట్రైసైకిల్ సాధించి మిత్రుడి కళ్లలో ఆనందం చూసి సంతోషంగా ఇళ్లకు వెళ్లారు. వివరాలిలా ఉన్నారుు. డెంకాడ మండలం గొడ్డుపల్లి గ్రామానికి చెందిన ఎర్రా రమేష్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూల్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇతను ట్రైసైకిల్ కోసం ఎన్నిమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోరుుంది.
దీంతో అతని స్నేహితులు నేరుగా కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌ససెల్‌కు తీసుకువచ్చారు. కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలిసి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్ వెంటనే మూడు చక్రాల సైకిల్‌ను మంజూరు చేశారు. ఈ మేరకు రమేష్‌ను విభిన్న ప్రతిభావంతుల శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ సైకిల్ ఇవ్వడంతో స్నేహితులంతా అమితానందంగా ఇంటికెళ్లారు.