ఏడాదిలోగా లక్ష ఎకరాలు | Thousand acres in the year | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా లక్ష ఎకరాలు

Published Sat, Jul 9 2016 2:15 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

ఏడాదిలోగా లక్ష ఎకరాలు - Sakshi

ఏడాదిలోగా లక్ష ఎకరాలు

బందరు పరిధిలోని 29 గ్రామాల్లో భూముల సమీకరణ..రాజధాని ప్యాకేజీయే ఇక్కడా అమలు
- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
- మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి అధికారాలు
- డీప్ వాటర్ సీ పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
- పట్టిసీమ ప్రాజెక్టులో పనిచేసిన వారికి ఇంక్రిమెంట్
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న భూసేకరణ, భూసమీకరణలపై పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నా లెక్కచేయని ప్రభుత్వం తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏకంగా లక్షా ఐదు వేల ఎకరాలను భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 22 వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతాభూమి పారిశ్రామిక కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని నిర్ణయించారు. 29 గ్రామాల్లో ఈ భూమినంతటినీ మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా ఏడాదిలోపు తీసుకోనుంది. రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇక్కడా ఇవ్వనున్నారు.

రాజధానికి 33 వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం పోర్టు, పారిశ్రామిక కారిడార్‌కు దానికి రెండు రెట్ల భూమిని తీసుకోవాలనుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మంత్రివర్గంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

► మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం 30 వేల ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరించాలని గత ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో వెనక్కు తగ్గింది. భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పోర్టుకు అవసరమైన 30 వేల ఎకరాలతోపాటు పారిశ్రామిక కారిడార్, ఇతర ప్రాజెక్టులకు కావాల్సిన మరో 70 వేల ఎకరాలు కలుపుకుని మొత్తం లక్షా ఐదు వేల ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. పెడన మండలంలోని ఒక గ్రామం, మచిలీపట్నం మండలంలోని 28 గ్రామాల్లోని 426 చదరపు కిలోమీటర్ల భూమిని మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా సేకరించనుంది. వచ్చే ఏడాది జూలైలోపు ఈ భూమిని సేకరించాలని గడువు విధించింది. కృష్ణా డెల్టా పరిధిలోని ఈ లక్షా ఐదు వేల ఎకరాల్లో రెండు పంటలు పండుతాయి. వరి పండే తమ భూములను భూసేకరణకు ఇచ్చేది లేదని అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రూటు మార్చి భూసమీకరణ పేరుతో వారి ముందుకు వెళ్లడానికి సిద్ధమవడం గమనార్హం. ఈ సమీకరణపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రఘునాథ్‌రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాట వేశారు. కృష్ణా డెల్టా కింద ఉన్న ఈ భూములను మెట్ట భూములని ఆయన చెప్పడం విశేషం.

► పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన ఇంజినీరింగ్, నీటిపారుదల శాఖ అధికారులు, ఉద్యోగులకు మంత్రివర్గం అభినందనలు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయం. ఇదే స్పూర్తితో పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేయాలి. ప్రతి నెలా మంత్రివర్గంలో ఈ ప్రాజెక్టుపై చర్చించి ప్రతి వారం సమీక్షించాలి. ప్రతి నెలా ముఖ్యమంత్రి ప్రాజెక్టును సందర్శించాలి.
► రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 15,745 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు. ప్రస్తుతం కనిష్టంగా ఉన్న రూ.6,700 వేతనాన్ని రూ.11,500కి, గరిష్టంగా ఉన్న రూ.12 వేలను రూ.17,500కి పెంచుతూ నిర్ణయం. వచ్చే నెల నుంచి ఇవ్వాలని ఆదేశం.
► ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) పార్కు ఏర్పాటుకు వంద ఎకరా ల భూమి కేటాయించేందుకు సమ్మతి. ఇప్పటికే 117 నియోజకవర్గాల్లో 18,340 ఎకరాల గుర్తింపు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో భూమిని సేకరించాలి. ఈ భూములను లేఅవుట్లుగా మార్చి రోడ్లు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యాలు కల్పించి చిన్న పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు అనుమతి.
► ప్రైవేటు యూనివర్సిటీల చట్టం ప్రకారం అమిత్, ఎస్‌ఆర్‌ఎం, విట్, సెంచురియన్, ఫిషరీస్ అండ్ ఓషన్ యూనివర్సిటీల ఏర్పాటుకు సుముఖత. వీటికి ఎల్‌ఓఐ (లెటర్ ఆఫ్ ఇంటెన్షన్) ఇచ్చేందుకు అంగీకారం. మొదటి మూడు వర్సిటీలకు రాజధానిలో, షిషరీస్ వర్సిటీకి భీమవరంలో భూమి ఇచ్చేందుకు సమ్మతి. సెంచురియన్ వర్సిటీకి విజయనగరంలో సొంతంగా భూమి ఉండడంతో ఏర్పాటుకు అనుమతి. వాటర్, ఎనర్జీ, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, స్పోర్ట్స్, ఫిషరీస్ యూనివర్సిటీలను ఆయా శాఖలు పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి.
► ఒంగోలు ట్రిపుల్ ఐటీని 2016-17 సంవత్సరానికి తాత్కాలికంగా ఆ నగరంలోని ఆర్‌కే వ్యాలీలో ఏర్పాటుకు అంగీకారం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని తాత్కాలికంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించేందుకు అనుమతి. రెండు క్యాంపస్‌లలో వెయ్యి మంది పిల్లలతో ప్రారంభించేందుకు అంగీకారం.
► ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి జిల్లాకూ బ్రాంచి, వాటి ద్వారా కాలేజీ, స్కూళ్లలోనూ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటు. ఇందుకోసం కొత్త ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ విధానం అమలు. జిల్లా కేంద్రాల్లో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అధికారుల నియామకం. ప్రతి శాఖలో ఇన్నోవేషన్ విభాగాలు ఏర్పాటు.
 
 మరికొన్ని నిర్ణయాలు ఇవీ...
 రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన సెజ్‌లపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం మరోవైపు ఆ సెజ్‌లను విస్తరించేందుకు భారీగా భూములు కేటాయించింది. విశాఖజిల్లాలోని సెజ్‌ల విస్తరణకు భూములివ్వాలని నిర్ణయించింది. సెజ్‌లతోపాటు రాష్ట్రంలోని పలు ప్రైవేటు సంస్థలకు,కొన్ని ప్రభుత్వ శాఖలకూ భూములు ఇవ్వాలని తీర్మానించింది. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూముల కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో నాలుగు బీఎస్సీ హార్టీకల్చర్ కాలేజీల ఏర్పాటుకు సమ్మతిస్తూ, పలు శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 స్కూల్ అసిస్టెంట్లుగా లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు
► రాష్ట్రంలోని గ్రేడ్-2 లాంగ్వేజ్ పండిట్లు, జెడ్పీ స్కూళ్లలో పనిచేస్తున్న పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
► 2017 జూన్ రెండో తేదీలోపు ఏపీలో తమ పేర్లు ఎన్‌రోల్ చేసుకుని సెల్ప్ డిక్లరేషన్ ఇచ్చిన వారికి ఇక్కడి స్థానికతను వర్తింపజేయాలని మంత్రివర్గం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement