నీ సిగతరగ.. | thousand crores business in hair export | Sakshi
Sakshi News home page

నీ సిగతరగ..

Published Sat, Aug 26 2017 11:11 PM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

నీ సిగతరగ..

నీ సిగతరగ..

వెంట్రుకతో వెయ్యికోట్లు 
ఇదీ కేశ పరిశ్రమ టర్నోవర్‌ 
జిల్లా నుంచి తలనీలాల ఎగుమతి 
విదేశాల్లో మంచి డిమాండ్‌ 
గతేడాది కన్నా తగ్గిన గిరాకీ
అంతర్జాతీయ ఆంక్షలే కారణం
 
వెంట్రుక వేస్తే కొండ వస్తుందో రాదో తెలీదుగానీ.. రూ.వ్యెయ్యి కోట్లు మాత్రం వస్తున్నాయి. ఇది నిజం. మన జిల్లా తలనీలాల పరిశ్రమలకు పెట్టింది పేరు. ఎగుమతుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది.    
 
 
ఇదీ మన ’కేశా’గారం పరిస్థితి 
మొత్తం పరిశ్రమలు 20
ఎగుమతుల్లో మన వాటా  75% 
ఉపాధి పొందుతున్న కార్మికులు  25,000
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
తణుకు : 
తలవెంట్రుకతో సమానం అంటే ఒకప్పుడు మనిషి ఉన్నతిని దిగజార్చి మాట్లాడటం... మరి ఇప్పుడు తలవెంట్రుక అంటే బంగారంగా పరిగణిస్తున్నారు... నల్ల బంగారంగా పేరొందిన తలనీలాలు(కేశాల) ఎగుమతికి జిల్లా పెట్టింది పేరు. అంతర్జాతీయ మార్కెట్‌లో జిల్లా హెయిర్‌ ఇండస్ట్రీ ప్రముఖంగా నిలుస్తోంది. దేశంలోనే మన జిల్లా తలనీలాల ఎగుమతికి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదుతో పాటు జిల్లా నుంచే అత్యధికంగా కేశాల ఎగుమతి జరుగుతోంది. జిల్లాలోని ఏలూరు, తణుకు, కొవ్వూరు ప్రాంతాల్లో సుమారు 20 వరకు హెయిర్‌ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సుమారు 25 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. జుట్టు ఉత్పత్తిలో తణుకు పట్టణానికి చెందిన ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీ గతంలో పలు పర్యాయాలు జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. తలనీలాల ఎగుమతిలో కేవలం జిల్లాలోనే ఏటా రూ.వెయ్యికోట్ల టర్నోవర్‌ జరుగుతుందంటే జుట్టుకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న కేశాల్లో 75 శాతం జిల్లా నుంచే ఉండటం విశేషం. 
ఇంటింటి సేకరణతోనే..
సాధారణంగా ఇంట్లో మహిళలు తల దువ్వుకున్న సమయంలో ఎంతో కొంత జట్టు రాలిపోతుంటుంది. ఇలా రాలిన జట్టును ప్రత్యేకంగా భద్రపర్చుతుంటారు. ఇలా భద్రపరచిన జట్టును కొన్ని వర్గాల ద్వారా సేకరించిన డీలర్లు మార్కెట్‌లో కిలో రూ.3 వేలకు కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలకు విక్రయిస్తుంటారు. అంతేకాకుండా తలనీలాలను ఆయా పుణ్యక్షేత్రాల్లోని  కేశఖండనశాలల నుంచి సేకరిస్తుంటారు. ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీల్లో వీటిని శుభ్రపరచి గ్రేడ్లుగా విభజించి చైనా, అమెరికా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, వేములవాడ, యాదగిరిగుట్ట, శ్రీశైలం, సింహాచలం పుణ్యక్షేత్రాల నుంచి ఏటా తలనీలాలను సేకరిస్తుంటారు. అయితే కేవలం 5 శాతం మాత్రం ఇలా పుణ్యక్షేత్రాల నుంచి సేకరిస్తుండగా మిగిలినదంతా ఇంటింటి నుంచి సేకరించినదే కావడం విశేషం. అయితే గతంలో ఇలా సేకరిస్తున్న చిన్న వర్తకులపై సేల్స్‌టాక్స్‌ పేరుతో అధికారులు వేధింపులకు గురి చేయడంతో ఈ ప్రభావం ఎగుమతులపై పడింది. ముఖ్యంగా రైలు, బస్సు మార్గాల ద్వారా తరలించే చిరువ్యాపారులను పన్ను పేరుతో ఇబ్బందులకు గురి చేసేవారు. ప్రస్తుతం జీఎస్టీ ప్రభావంతో అధికారుల వేధింపులు కొంతవరకు తగ్గాయని పలువురు చెబుతున్నారు. 
మహిళల కేశాలకు డిమాండ్‌
ఇంటింటి నుంచి సేకరించిన జట్టుతో పాటు ఆలయాల్లో కేశఖండనశాలల ద్వారా వచ్చిన జట్టును వివిధ దశల్లో ప్రాసెసింగ్‌ చేస్తారు. మొదటి రకం స్పెషల్‌ గ్రేడ్, అలాగే గ్రేడ్‌ 1, 2, 3లుగా మార్కెట్‌లో విక్రయిస్తారు. అయితే మార్కెట్‌లో మహిళల కేశాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. ఆఖరి గ్రేడ్‌ రకం పురుషుల జుట్టు. స్త్రీల జుట్టు ఎక్కువగా విగ్గుల తయారీకి వాడతారు. అలాగే పురుషుల జుట్టును ఆగ్రో కెమికల్స్‌లో వినియోగిస్తారు. గతంలో క్రెస్తవులు, చైనా, థాయిలాండ్‌ దేశస్తులు వారి ఇష్ట దైవాలకు మొక్కుబడిగా కేశాలను సమర్పించే వారు కాదు. అయితే గత కొన్నాళ్లుగా వీరు కూడా మొక్కుబడులు చెల్లిస్తుండటమే భారతదేశపు ఉత్పత్తులపై ప్రభావం చూపడానికి గల కారణమని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. భారతదేశం నుంచి చైనా, హాంకాంగ్‌లకు ఎగుమతి అయిన కేశాలు అక్కడి నుంచి ప్యారిస్, ఇంగ్లాండ్, రష్యా, అమెరికా వంటి 172 దేశాలకు చేరుతుంది. వాటితో అక్కడ తయారయ్యే విగ్గులను సినీ పరిశ్రమల వారు ఎక్కువగా వినియోగిస్తున్నారు. 
 
చైనా విధానంతో సంక్షోభం (నోట్‌ : స్రీన్‌ ఐటెం)
ఏడాది వరకు జోరుగా సాగిన వ్యాపారం ప్రస్తుతం డీలా పడటంతో వ్యాపారులు అయోమయంలో పడ్డారు. కేశాలకు గతంలో ఉన్న ధర లేకపోవడానికి ప్రధాన కారణం మన దేశం నుంచి చైనా దేశం ఎగుమతులను నిలిపివేయడమే. రెండేళ్ల క్రితం వరకు చైనా మార్కెట్‌ ఏడాదికి 100 టన్నుల జుట్టును మన దేశం నుంచి కొనుగోలు చేసేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చైనా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసిందని, అందుకే నిల్వలు పెరిగి ధర పతనమైందని అంటున్నారు. అయితే కొన్ని ఆంక్షలతో చైనా కేశాలను కొనేందుకు ముందుకొచ్చినప్పటికీ.. ఆ ఆంక్షలకు లోబడి వ్యాపారం చేసే ధీమా ఇండస్ట్రీ యజమానుల్లో లేదు. కోట్ల రూపాయల సరుకును కొనుగోలు చేసిన చైనా 6 నెలల తరువాతే సొమ్ములను చెల్లిస్తామన్న ఆంక్షలు అంతర్జాతీయ మార్కెట్‌లో జుట్టు ఎగుమతులకు ఆటంకమవుతోంది. దీంతో గతేడాదితో పోలిస్తే మార్కెట్‌లో జుట్టుకున్న డిమాండ్‌ బాగా తగ్గింది. అంతర్జాతీయ సంక్షోభంతో పాటు యూరోప్‌ దేశాల్లో ఆర్థిక మాంద్యం ప్ర«భావం ఎగుమతులపై పడింది. ఇదిలా ఉంటే ముడి సరుకును ఇక్కడి నుంచి నేరుగా చైనా కొనుగోలు చేసి అక్కడే ప్రాసెసింగ్‌ చేయడంతో వ్యాపారులకు చిక్కులు ఎదురవుతున్నాయి. వంద గ్రాముల జుట్టును ప్రాథమికంగా ప్రాసెస్‌ చేయడానికి ఇక్కడ రూ.300 ఖర్చు అవుతుంటే... బర్మాలో రూ.60 ఖర్చు అవుతోంది. దీంతో చైనా వ్యాపారుల నుంచి నేరుగా ముడి సరుకును కొనుగోలు చేసి బర్మాకు ఎగుమతి చేస్తోంది. 
 
ముడిసరుకు ఎగుమతులు నిలిపేయాలి
తలనీలాల ఎగుమతిలో అంతర్జాతీయస్థాయిలో జిల్లా ప్రఖ్యాతి గాంచింది. రెండేళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల హెయిర్‌ ఇండస్ట్రీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థంగా మారుతోంది. గతంలో ముడిసరుకు కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం చైనా దేశం నేరుగా ముడి సరుకును కొనుగోలు చేసి స్వయంగా ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతులు ప్రారంభించింది. దీంతో ఇక్కడి వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనాకు ముడిసరుకు ఎగుమతులు నిలిపివేయడం ద్వారానే ఇక్కడి ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలకు మనుగడ ఉంటుంది.
 వంక రవీంద్రనా«థ్, ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, తణుకు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement