![The minimum support price of banana is Rs 800 per quintal - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/21/banana.jpg.webp?itok=n4pnGxtt)
నాలుగేళ్లలో 1.80 లక్షల టన్నుల ఎగుమతి
ఈ ఏడాది లక్ష టన్నుల లక్ష్యం.. ఇప్పటికే 50 వేల టన్నులు పూర్తి
టీడీపీ హయాంలో కేవలం 23వేల టన్నులు ఎగుమతి
జగన్ సర్కారులో విప్లవాత్మక మార్పులు
2019–20 నుంచి ఊపందుకున్న ఎగుమతులు
అరటి కనీస మద్దతు ధర క్వింటా రూ.800
ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1950 మధ్య పలుకుతున్న ధర
సాక్షి, అమరావతి: ఆంధ్ర అరటికి ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. గ్రోత్ ఇంజన్ క్రాప్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అరటి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగులోనే కాదు.. ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతుల్లో కూడా అద్భుత ప్రగతిని సాధించింది. గడిచిన నాలుగేళ్లలో 1.80 లక్షల టన్నులు ఎగుమతి కాగా, ఈ ఏడాది లక్ష టన్నుల్ని ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో ఇప్పటికే 50 వేల టన్నులు ఎగుమతి అయ్యాయి. మరోవైపు.. మిడిల్ ఈస్ట్ దేశాలకే ఇప్పటివరకు ఎగుమతయ్యే అరటి ఈసారి మొట్టమొదటిసారిగా రష్యాకు కూడా ఎగుమతి అయ్యింది. ఇకపోతే అరటికి కనీస మద్దతు ధర క్వింటా రూ.800 కాగా, ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,950 మధ్య పలుకుతోంది.
రికార్డు స్థాయిలో దిగుబడులు..
విదేశాల్లో డిమాండ్ ఉన్న ఎరువు, కర్పూర, చక్కరకేళి, అమృతపాణి, బుడిద చక్కరకేళి, తేళ్ల చక్కరకేళి, సుగంధాలు, రస్తాలి వంటి రకాలు ఏపీలోనే సాగవుతున్నాయి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి రకం), టిష్యూ కల్చర్ రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
దీంతో 2018–19 నాటికి 1.90 లక్షల ఎకరాల్లో సాగవుతూ 50 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే అరటి సాగు ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. టిష్యూ కల్చర్ ప్లాంట్ మెటీరియల్, ఫ్రూట్ కేర్ కార్యకలాపాలు, బిందు సేద్యం వంటి అధునాతన సాంకేతిక పద్ధతుల వలన ఉత్పాదకత హెక్టార్‌కు 60 టన్నులకు పైగా వస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం 2023–24లో 62 లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయని అంచనా వేశారు.
ఫలించిన సీడీపీ ప్రాజెక్టు..
ఇక రాష్ట్రంలో అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రూ.269.95 కోట్లతో చేపట్టిన క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (సీడీపీ) సత్ఫలితాలిస్తోంది. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్–ప్రొడక్షన్) వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతరం నిర్వహణ–విలువ ఆధారిత (పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, వాల్యూ ఎడిషన్) కోసం రూ.74.75 కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70 కోట్లు ఖర్చుచేస్తున్నారు.
నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్‌ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం (ఐపీఎం), ప్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తోట బడుల ద్వారా 15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిచ్చారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ) ఇస్తున్నారు.
ఏటా పెరుగుతున్న ఎగుమతులు..
పీపీపీ ప్రాజెక్టు కింద చేపట్టిన ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలైన యూఏఈ, బెహ్రాన్, ఈజిప్‌్ట, సౌదీ అరేబియా, కతార్, ఇరాన్ వంటి దేశాలకు అరటి ఎగుమతి అవుతోంది.
♦ 2016–17 వరకు అరటి పంట రాష్ట్రం కూడా దాటే పరిస్థితి ఉండేది కాదు. ఆ ఏడాది తొలిసారి 246 టన్నులు ఎగుమతి చేస్తే 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులు ఎగుమతి చేశారు.
♦ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాది (2019–20)లోనే రికార్డు స్థాయిలో 35వేల టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేశారు.
♦ ఆ తర్వాత వరుసగా 2020–21లో 48వేల టన్నులు, 2021–22లో 48,200 టన్నులు, 2022–23లో 49,500 టన్నులు ఎగుమతి అయ్యాయి.
♦ ఇక ఈ ఏడాది 75 వేల టన్నులను ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 50 వేల టన్నుల అరటి ఎగుమతైంది.
♦ ఈ సీజన్ ముగిసే నాటికి లక్ష టన్నులు దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment