పార్టీలు మారిన వారికి ముప్పు తప్పదు | threat to those who defected | Sakshi
Sakshi News home page

పార్టీలు మారిన వారికి ముప్పు తప్పదు

Published Sun, Jul 3 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

threat to those who defected

- గోడ దూకిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారు
- పార్టీలు మారకుండా చట్ట సవరణ చేయాలి
- జనచైతన్య వేదికలో వక్తల డిమాండ్

తిరుచానూరు

 ప్రజలెన్నుకున్న పార్టీకి వెన్నుపోటు పొడిచే నాయకులకు భవిష్యత్‌లో ముప్పు తప్పదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతిలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు.

 

ఈ చర్చాగోష్టికి నగరంలోని విభిన్న వర్గాల మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకుడిలా వ్యవహరించడం బాధాకరమన్నారు.

 

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 13 మందిపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదును సాంకేతిక కారణాలతో తోసిపుచ్చడంతో, స్పీకర్ నైతిక బలాన్ని కోల్పోయారని విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడడం రాజకీయ వ్యభిచారమేనన్నారు. ఈ నెల 31న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బిపి.జీవన్‌రెడ్డి అధ్యక్షతన ఇదే అంశంపై చర్చాగోష్టి నిర్వహించనున్నట్లు తెలిపారు.


ప్రజా సంక్షేమం విస్మరించి సిద్ధాంతాలు లేని రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే గెలవాలని ప్రయత్నించడం, దీనికోసం ఏకంగా రూ.280 కోట్లు ఖర్చుపెట్టడం ధన రాజకీయానికి నిదర్శనమని తెలిపారు. అనంతరం ఈ చర్చాగోష్టిలో పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు.

 

అంబేడ్కర్ ఆశించిన ప్రజాస్వామ్యం లేదని మాజీ వీసీ ప్రొఫెసర్ కె. వెంకటరెడ్డి అన్నారు. నాయకుల గుప్పెట్లో ప్రజాస్వామ్యం బందీ అయ్యిందని ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ఎ.రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష నాయకులు సైతం ఫిరాయింపులకు పాల్పడడం దుర్మార్గమని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ అన్నారు.

 

ప్రజాస్వామ్యం ధనిక స్వామ్యంగా మారిందని సీనియర్ పాత్రికేయులు రాఘవశర్మ అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుదారులు తిరిగి ఎన్నిక కాకుండా అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘాలని కల్పించాలని అకాడమీ ఆఫ్ గ్రాస్ రూట్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా డెరైక్టర్ డాక్టర్ డి. సుందరరామ్ అన్నారు. ఈ చర్చాగోష్టిలో పెద్దఎత్తున ప్రజలు, నాయకులు, పాత్రికేయులు, వివిధ సంఘాల నాయకులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement