రాకాసి రహదారులు
- వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు ముగ్గురి దుర్మరణం
- దైవదర్శనానికి వెళ్లొస్తూ ఇద్దరు ‘అనంత’ విద్యార్థులు..
- బైక్‌పై బయలుదేరిన కాసేపటికే వ్యాపారి..
రాకాసి రహదారులు ప్రజల రక్తం తాగుతున్నాయి. అయిన వారి కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్నాయి. నిర్లక్ష్యం.. అజాగ్రత్త..అలసత్వం.. ఏదైనా సరే.. నిండు జీవితాలు అర్ధాంతరంగా బలైపోతున్నాయి. తాజాగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు దైవదర్శనానికి వెళ్లొస్తూ ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే మృత్యుబారినపడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో తీరని విషాదం నెలకొంది.
కూడేరు(ఉరవకొండ) : కూడేరు మండలం శివరాంపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం రుద్రంపేటకు చెందిన పుల్లప్ప కుమారుడు కుమార్(13), రామాంజనేయులు కుమారుడు ముఖేష్(14) మరణించారు. ఎస్‌ఐ రాజు తెలిపిన మేరకు... కుమార్, ముఖేష్ సహా మరో ముగ్గురు కలసి ఆటోలో పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆటోలో వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం వారంతా అదే ఆటోలో తిరుగుప్రయాణమయ్యారు.
మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న ఆటో శివరాంపేట వద్దకు రాగానే అనంతపురం నుంచి ఉరవకొండకు బయలుదేరిన లారీ విపరీతమైన వేగంతో వచ్చి, బలంగా ఢీకొనడంతో కుమార్ తలభాగం పూర్తిగా తెగిపోగా, మొండెం మాత్రం మిగిలింది. తీవ్రంగా గాయపడిన ముఖేష్‌ను అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమార్ 8వ తరగతి, ముఖేష్ 9వ తరగతి చదువుతున్నారు. పుల్లప్పకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కాగా, ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహంపై పడి రోదించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.