సాక్షి, ఉరవకొండ: కళాశాలలో జరిగే జెండా వందనానికి వెళ్తూ ఓ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. చిన్నముస్టూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. మూలగిరిపల్లికి చెందిన సునీల్ (18) ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కళాశాలలో జరిగే గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు స్నేహితుడు సుధాకర్‌తోపాటు తమ గ్రామానికే చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినితో కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. చిన్నముస్టూరు సమీపంలో ఎద్దుల బండిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని వీరి బైక్ ఢీకొనడంతో సునీల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులు, కళాశాల విద్యార్థులతోపాటు అధ్యాపకులు రాజశేఖర్, లత, పద్మ, అనితలు ఆసుపత్రికి చేరుకుని సునీల్ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.