తూ.గో.జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమార్ కుటుంబ సభ్యులు. (మధ్యలో ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి సిరివర్ధిని) (పాతచిత్రం)
యానాం/ఐ.పోలవరం/నల్లమాడ/బి.కొత్తకోట: రాష్ట్రంలోని తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదిమంది దుర్మరణం చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో బైక్‌ను వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడగా, అనంతపురం జిల్లాలో మినీ వ్యాన్ బోల్తా పడిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చిత్తూరు జిల్లాలో జరిగిన మరో ఘటనలో వాహనం కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు విగతజీవులయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలివీ..
బైక్‌పై వెళ్తూ..
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరానికి చెందిన వైదాడి కుమార్ (32) అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్త సత్తెమ్మను చూసేందుకు భార్య పద్మకుమారి (27), కుమారుడు హర్ష సత్యవర్మ (10), కుమార్తెలు హర్షిత (10), సిరివర్ధిని (లక్కీ)లతో కలిసి బైక్‌పై కాకినాడ బయల్దేరారు. ఎదుర్లంక బాలయోగి వారధిపైకి వచ్చేసరికి వారి బైక్‌ను.. వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్, పద్మకుమారి, హర్ష సత్యవర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత మృతి చెందింది. సిరివర్ధిని చికిత్స పొందుతోంది. వీరిలో హర్ష సత్యవర్మ, హర్షిత కవలలు.
తిరుమల నుంచి వస్తూ..
అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన మల్లికార్జున, శిరీష దంపతుల కుమార్తె సమన్విత పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం 20 మంది మినీ వ్యాన్‌లో శుక్రవారం రాత్రి తిరుమల వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం శనివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వీరిలో ఐదుగురు కదిరిలో దిగిపోగా.. మిగిలిన 15 మందితో వ్యాన్ పులగంపల్లికి బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజాము 4.45 గంటల సమయంలో పులగంపల్లికి సమీపంలోని జోడు బావుల వద్దకు రాగానే వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో అక్కడ కూర్చున్న దంపతులు చిలమత్తూరు చలపతి (50), సి.బాగాదమ్మ (45)తోపాటు ఈశ్వర్ (18) అక్కడికక్కడే మృతిచెందారు. వ్యాన్ డ్రైవర్ రవి, సుధాకర్, రాధమ్మ, గంగాదేవి, వెంకటరమణ, సుభాషిణి, శ్రీనాథ్‌లు గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాలువలోకి వాహనం దూసుకెళ్లడంతో..
ఇక చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట మండలం, హార్సిలీహిల్స్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న సందర్శకుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని పెనుమూరు, వెదురుకుప్పం మండలాలకు చెందిన 15 మంది భక్తులు ఆదివారం ఉదయం కారులో చౌడేపల్లెలోని బోయకొండ అమ్మవారి దర్శనానికి బయల్దేరారు.
అక్కడ నుంచి హార్సిలీహిల్స్ వెళ్లి తిరుగు ప్రయాణంలో సా.6 గంటల ప్రాంతంలో వాహనం అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది. అందులోని వారు కాలువలోకి ఎగిరిపడ్డారు. కొందరు వాహనంలోనే ఇరుక్కుపోయారు. వెదురుకుప్పం మండలం చవటకుంటకు చెందిన డ్రైవర్ మణి (30), పరికేపల్లికి చెందిన జానీ (43), అగ్గిచేనుపల్లెకు చెందిన టి.నందిని (25) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 108 ద్వారా క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment