సాగర్‌లో... లారీ బీభత్సం
నాగార్జుసాగర్/ పెద్దవూర : జిల్లా రహదారులపై నెత్తుటి మరకలు ఆరడం లేదు. మితిమీరిన వేగం..డ్రైవర్ల నిర్లక్ష్యం..నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. నాగార్జునసాగర్‌లో సోమవారం రాత్రి లారీ బీభత్సానికి నలుగురు బలైపోయారు. అతివేగంతో వచ్చిన లారీ రోడ్డుపై ఉన్న పోలీస్, జెన్‌కో, ద్విచక్రవాహనాలతో పాటు నిలబ డిన వారిని కూడా ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ప్ర మాదంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరియదాస్ (35), పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న బాలునాయక్ (25), పెద్దవూర మండలం నె ల్లికల్లుకు చెందిన నడ్డి చంద్రయ్య(45), గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన హసీబ్ (19) మృత్యువాత పడగా మరో నలుగురు గాయపడ్డారు.
గడ్డి ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో..
పెద్దవూర మండలం పోతునూరు గ్రామం నుంచి ఏడుగురు వ్యక్తులు ట్రాక్టర్‌పై గడ్డిలోడుతో సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గోడుమడకకు బయలుదేరారు. మార్గమధ్యలో సాగర్ సమీపంలోని దయ్యాలగండి వద్దకు రాగానే మూలమల్పు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ట్రాలీ, ఇంజన్ మధ్యలో ఇరుక్కున్నాడు. ఇదే సమయంలో జమ్మనకోటకు చెందిన హోంగార్డు బాలునాయక్ పెద్దవూర పోలిస్టేషన్‌లో çవిధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. దయ్యాలగండి వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనను చూసి ఎస్‌ఐ గౌరినాయుడుకు సమాచారం ఇచ్చారు.
ట్రాక్టర్‌ను పక్కకు తీస్తుండగా..
సమాచారం అందుకున్న ఎస్‌ఐ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బం దితో పాటు రోడ్డుపై నిలిచిపోయిన వాహనదారుల సహాయంతో ట్రాక్టర్‌ను పక్కకు తీసేందుకు ఉప క్రమించారు.
ఒక్కసారిగా దూసుకొచ్చి..
రోడ్డుపై ట్రాక్టర్ అడ్డంగా పడి ఉండడంతో రహదారికి రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న జెన్‌కో ఉద్యోగుల వాహనం కూడా అక్కడే నిలిచిపోయింది. ఈ క్రమంలో సాగర్ నుంచి హైదరాబాద్ వైపునకు మృత్యు రూపంలో వచ్చిన లారీ అడ్డొచ్చిన వాహనాలతో పాటు రోడ్డుపై నిలబడిన వారిపైకి దూసుకుంటూ వెళ్లిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడున్న వారందరూ ఆహాకారాలు చేసస్తూ ఉరుకులు, పరుగులు తీశాయి. ఈ లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరియదాస్ (35), హోంగార్డు బాలునాయక్ (25), పెద్దవూర మండలం నెల్లికల్లు గ్రామానికి చెందిన నడ్డి చంద్రయ్య(45), గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన హసీబ్ (19)లను ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సాగర్ ఎడమకాలువపై ఉన్న విద్యుత్ ఉత్పాదక కేంద్రంలో పని చేస్తున్న ఏఈ క్రాంతిభూషన్, పందిరి మురళితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్, నల్లగొండ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతుల, క్షతగాత్రుల బంధువుల రోదనలు కమలానెహ్రూ ఆస్పతిలో మిన్నంటాయి.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమలా నెహ్రూ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఆయన వెంట దేవరకొండ డీఎస్పీ రవికుమార్, సాగర్, హాలియా సీఐలు పార్థసారథి, ఆదిరెడ్డి ఉన్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ కొద్ది దూరంలో నిలిపివేసి పరారయ్యాడు. లారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.