
విద్యార్థిని ఆత్మహత్య కేసు: ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
నాగార్జున వర్సిటీ (గుంటూరు) : గత రెండు రోజుల క్రితం నాగార్జున యూనివర్శిటీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రిషికేశ్వరి కేసుకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే యూనివర్శిటిలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు అనూష, జయచరణ్, శ్రీనివాస్ లను పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. ఈ విద్యార్ధుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్కిటెక్చర్ ఫస్టియర్ చదువుతున్న వరంగల్ జిల్లాకు చెందిన మొండి రుషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. కళాశాలకు వెళ్లకుండా రూంలోనే ఉండిపోయిన రుషికేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ర్యాగింగే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె వద్ద లభించిన సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా ముగ్గురు సీనియర్ విద్యార్థులు అరెస్ట్ చేశారు.