చైనా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా దేశవాళీ టపాసులను మాత్రమే విక్రయించాలని వ్యాపారులకు డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాటిని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం ఒక ప్రకటన హెచ్చరించారు. డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) సమాచారం మేరకు రాష్ట్రంలోకి అక్రమ మార్గంలో విదేశీ టపాసులు, ముఖ్యంగా చైనాకు చెందినవి వచ్చినట్లు తెలిసిందని చెప్పారు.
విదేశాల నుంచి టపాసులు దిగుమతి చేసుకోవాలంటే విదేశీ వర్తక సమాఖ్య నుంచి అనుమతి తీసుకోవాలని, అయితే అలాంటి అనుమతులు తీసుకున్న దాఖలాలు ఏ ఒక్కటీ లేవన్నారు. చైనా టపాసులను వ్యాపారులు అమ్మితే తాత్కాలిక లెసైన్సు రద్దు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అన్ని జిల్లాల్లోని టపాసుల దుకాణాలను తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.