వ్యాన్‌లోంచి దూకేశాడు.. వైరల్ వీడియో!
బీజింగ్: రోడ్డుపై ఓ వ్యాన్ వేగంగా వెళ్తోంది అందరూ చూస్తుండగానే ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా భయంతో రోడ్డుపైకి దూకేశాడు. ఆ వెంటనే వ్యాన్‌కు దూరంగా పరిగెత్తాడు. కొన్ని క్షణాల్లోనే వాహనం రోడ్డుపై మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ షాకింగ్ ఘటన చైనా గాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లోని డోంగ్వాన్‌లో గత సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వివరాలు.. ఓ వ్యక్తి తన వ్యాన్‌లో డోంగ్వాన్ రోడ్డులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో వాహనం ఇంజన్‌లో మంటలు రావడం గమనించాడు. వాహనం రోడ్డుపై ఆపి, ఏం జరిగిందో చూసే సమయం లేదని గ్రహించిన ఆ వ్యక్తి.. ఒక్కసారిగా వ్యాన్‌లోంచి రోడ్డుపై దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు.
వ్యాన్ నుంచి దూకిన కొన్ని క్షణాల్లో వాహనం మంటల్లో కాలి బూడిదైంది. ఆ వ్యాన్‌తో పాటు పార్కింగ్ ప్రదేశంలో ఉన్న మరో ఏడు వాహనాలు కాలి బూడిదయ్యాయని, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సీసీటీవీ ఫుటేజీ వీడియోని అధికారులు విడుదల చేయగా ఇది చూసిన వారు షాకవుతున్నారు. వ్యాన్‌లోంచి ఆ వ్యక్తి దూకిన సమయంలో వెనుక నుంచి మరో వాహనం రాకపోవడంతో అతడు అసలుసిసలైన అదృష్టవంతుడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.