- నేడు హిందీ దివాస్
భారతదేశ జాతి సమైక్యతకు ప్రతీకగా హిందీ భాష నిలుస్తోంది. విభిన్న భాషల సమాహారంగా ఉన్న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించే సమయంలో గాంధిజీ ఎక్కువగా హిందీలోనే మాట్లాడేవారు. జాతి మొత్తం ఆ భాషను సులువుగా అర్థం చేసుకునేది. అందుకే 1949 సెప్టెంబర్ 14న హిందీని జాతీయభాషగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజల మధ్య సద్భావన, సంస్కతిని కాపాడడంలో హిందీకి అధికార భాష హోదానిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) రూపొందించారు. అప్పటి నుంచి హిందీ రాజ‡భాషగా హోదాను సంతరించుకుంది. ‘దేవనాగరీలిపి’గా పేరొందిన హిందీని ఎందరో మహాకవులు, రచయితలు సుసంపన్నం చేశారు. వారిలో అనంత వాసులూ ఉన్నారు. వివిధ సేవా కార్యక్రమాలతో పాటు హిందీ ప్రచారానికి తమ వంతు కషి చేస్తూ రాజభాషను అందరికీ దగ్గర చేస్తున్నారు.
విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ
విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ పెంచుకునేలా ఆ భాషలోనే బోధించేలా ప్రభుత్వం సన్నాహాలు చేయాలి. తెలుగుభాషకు ప్రాధాన్యత కల్పించినట్లు హిందీభాషకు కూడా ప్రాముఖ్యత అందించాలి. ఆంగ్లంపై వ్యామోహాన్ని తగ్గించి జాతీయభాష హిందీని నేర్చుకుని మాట్లాడేలా చొరవచూపాలి. ప్రతి పరీక్షల్లో హిందీభాషలో క్వాలీఫై మార్కులు వస్తేచాలని చెబుతుంటారు. అలా కాకుండా హిందీలో వచ్చిన మార్కులను అన్ని సబ్జెక్టులతోపాటు లెక్కిస్తే హిందీభాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది.
– వేణుగోపాలాచార్యులు, హిందీ పండిట్
బోధనా భాషగా హిందీని చేర్చాలి
జాతీయభాష అయిన హిందీని విస్మరించడం శోచనీయం. ప్రభుత్వం స్పందించి బోధనాభాషగా హిందీని పెట్టి ఆంగ్లంపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించాలి. ఇటీవల హిందీ నేర్చుకునేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు కూడా ఆంగ్లభాష కాకుండా హిందీ వచ్చినవారికే కల్పించేలా ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపట్టాలి.
– ఎం.రియాజ్ బాషా, ఉపాధ్యాయుడు, వెల్దుర్తి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల
రచనల్లో మేటి డా.జూటూరు షరీఫ్
అనంత కీర్తిని జిల్లా ఎల్లలు దాటించిన హిందీ ప్రచారకులలో జూటూరు షరీఫ్ ఒకరు. ద్విభాషా కవిగా గుర్తింపు పొందిన ఆయన హిందీ పండితునిగా ప్రస్తుతం ధర్మవరం మండలం చిగిచెర్లలో పనిచేస్తున్నారు. భాషా ప్రచారానికి గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. కెరే జగదీష్ రచించిన ‘రాత్రి సూర్యుడు’ రచనకు షరీఫ్ అనువాదం చేసిన ‘నిశిధికీ సూర్య్’ ఎందరినో ఆలోచింపజేసింది. ముఖ్యంగా కబీర్ అకాడమీని స్థాపించి ఎంతో మంది విద్యార్థుల చేత భాషా ప్రవీణ పరీక్షలను రాయిస్తూ హిందీ పట్ల అభిమానాన్ని పెంచుతున్నారు. హిందీ జాతీయ సదస్సుల్లో అనంత తరుపున తరచుగా వెళ్లే షరీఫ్ మాట్లాడుతూ ‘ జాతీయ స్థాయిలో జాతీయ సమైఖ్యతకు ప్రతిరూపంగా నిలిచిన హిందీభాషను చిన్నచూపు చూడొద్దంటారు.
సేవకు ప్రతి రూపం
ఆరు పదులు దాటిని తరగని ఉత్సాహంతో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనే సూర్యనారాయణరెడ్డి హిందీ భాషా ప్రచారకునిగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరుగడించారు. ‘భారతీయ మైత్రికి ప్రతిబింబమైన హిందీని అందరూ అభ్యసించాలి. దేశంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. వారి సాహిత్యాన్ని సంస్కతీ ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి హిందీభాషే చక్కటి వారధి. అంతేగాక ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం ద్వారా ఉత్తమ పౌరులుగా దేశసమగ్రతకు పాటుపడతామన్న సద్భావం అందరూలోనూ రావాలి’ అని ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి అన్నారు.
జాతి సమైఖ్యతకు ప్రతీక ‘హిందీ’
Published Tue, Sep 13 2016 10:22 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement