
నేడు వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
సీఎం చంద్రబాబు అనైతిక విధానాలకు వ్యతిరేకంగా నిరసన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనైతిక విధానాలకు నిరసనగా నెల్లూరు నగరంలో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.
రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజల గొంతైన ప్రతిపక్షాన్ని లేకుండా చేయటానికి అధికారపార్టీ కుట్రపన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తోందని, అందుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి ఎంపీలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లాస్థాయి కార్యవర్గసభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా సొసైటీ, మండలపార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొనాలని కాకాణి పిలుపునిచ్చారు.