డేంజర్ జోన్స్ పై ఆరా..!
► పర్యవేక్షణ చేస్తున్న ఆర్టీఏ అధికారులు
►నెలరోజుల్లో నివేదికలు తయారు
సిరిసిల్ల క్రైం : జిల్లాలోని 13 మండలాల ద్వారా ఇతర జిల్లాలను కలిపే మార్గాల్లో గల డేంజర్ జోన్స్ ను గుర్తించడానికి జిల్లా రవాణాశాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలను నిర్మూలించాలనే కోణంలో డేంజర్ జోన్స్పై కచ్చితమైన నివేదిక కోసం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రూట్ మ్యాప్‌లతో తనిఖీలు...
జిల్లా కేంద్రంగా సిరిసిల్ల నుంచి కామారెడ్డి, సిరిసిల్ల నుంచి సిద్దిపేట, సిరిసిల్ల నుంచి రుద్రంగి, సిరిసిల్ల నుంచి సిరికొండ, సిరిసిల్ల నుంచి కొదురుపాక వరకు ఉన్న రహదారులపై ప్రమాద స్థలాలను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రూట్స్‌లో ఉన్న వివిధ రకాల పాత బావులు, ప్రమాద మలుపులు, ఇరుకైన రోడ్లు వంటి అంశాలను నిర్ణీత నమూనాలో పొందుపరుస్తున్నారు. వీటన్నింటినీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు నెల రోజుల వ్యవధిలో అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రవాణాశాకాధికారులు తెలిపారు. దీని ఆధారంగా ప్రమాదాల నివారణకు చెక్ పెట్టడానికి కావాల్సిన చర్యలను జిల్లా ఉన్నతాధికారులు ఆయా శాఖలకు ఆదేశాలిస్తారని వివరించారు. జిల్లా పునర్ విభజన అనంతరం ప్రమాదాలకు జిల్లాలో తావులేకుండా చూడాలన్న స్థాయిలో పర్యవేక్షణ చేయడంతోపాటు స్థానికులతో అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటునట్లు విశ్వసనీయంగా తెలిసింది.
విద్యాలయాల వద్ద ప్రత్యేక ఫోకస్..
భావిభారత పౌరులుగా ఎదిగే విద్యార్థులుంటే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను తీసుకోవాలని జిల్లా అధికారులు ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్నట్లు పర్యవేక్షణలోని అధికారులు చెబుతున్నారు. విద్యాలయాల ఎదుట హెచ్చరికల బోర్డులు, జీబ్రా క్రాసింగ్ లైన్లు, స్టాపర్లు ఏర్పాటు చేసుకోవాలన్న కోణంలో సలహాలిస్తున్నట్లు తెలిసింది. దీని విషయంలో విస్తృతంగా ఆయా విద్యాలయాల యాజమాన్యాలతోను మాట్లాడాలని మౌళిక అదేశాలలో ఉన్నట్లు తెలిసింది