కొత్త చట్టాలపై అవగాహన అవసరం
ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఫల్గుణకుమార్
రాజమహేంద్రవరంలో వర్తకులకు అవగాహన సదస్సు
దానవాయిపేట (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అదాయ పన్ను శాఖలో చేసిన మార్పులు చేర్పులు, ఇతర పన్నులపై వర్తకులందరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇ.ఫల్గుణకుమార్ వర్తకులకు సూచించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వరంలో అదివారం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద గల చాంబర్ ఫంక‌్షన్ హాలులో ఆర్థికక లావాదేవీలు, పన్ను చెల్లింపులపై వర్తకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇ.ఫల్గుణకుమార్, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కో అర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తకులు తమ వ్యాపార లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు . ఒక సంవత్సరానికి రూ.10 లక్షలు మించిన వ్యాపార లావాదేవీలపై ప్రభుత్వానికి 15 శాతం సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.మూడు లక్షలకు మించి ఎవరైనా నగదు లావాదేవీలను నిర్వహిస్తే ఆదాయపన్ను శాఖ ద్వారా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని లావాదేవీలకు తగిన రశీదులు తప్పనిసరిగా ఏడు సంవత్సరాల పాటు భద్రపరచాలని సూచించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పన్ను చెల్లించడానికి ఏ వర్తకుడికి ఇబ్బంది ఉండదని , ఐతే కొందరు అధికారులు చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని వర్తకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. అటువంటి అధికారులపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఈ చట్టాలు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ సమావేశానికి చాంబర్ నగర అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షత వహించగా, ఏపీ ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కన్వీనర్ అశోక్‌కుమార్‌జైన్, జిల్లా అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, క్రైడాయ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కాకినాడ చాంబర్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, చాంబర్ కార్యదర్శి కాలెపు రామచంద్రరావు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వలవల దుర్గప్రసాద్(చిన్ని), టి.వీరభద్రరావు, వి.సత్యనారాయణ, కె.లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.