ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిషేధం
విజయవాడ : ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కారణంగా సోమవారం అర్ధరాత్రి నుంచి పనులు పూర్తయ్యే వరకూ అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించామని విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సావాంగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక (సీతమ్మవారి పాదాలు), కుమ్మరిపాలెం, వన్‌టౌన్ వైపు నుంచి, తాడేపల్లి, సీతానగరం వైపు నుంచి ప్రకాశం బ్యారేజీవైపు రాకపోకలు సాగించే వాహనాలు ఈ మార్పును గమనించాలని, పాదచారులను కూడా అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
గొల్లపూడి, కుమ్మరిపాలెం, వన్‌టౌన్ ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు గొల్లపూడి వద్ద నుంచి సితారా సెంటర్, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్ మీదుగా పంజా సెంటర్, రైల్వే వెస్ట్ బుకింగ్, ఆర్టీసీ టెర్మినల్, లోబ్రిడ్జి, పోలీస్ కంట్రోల్ రూమ్, బందరు లాకులు మీదుగా తొమ్మిదో నంబరు జాతీయ రహదారికి చేరుకుని.. అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా ప్రయాణించాలి.
ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు బందర్ లాకుల మీదుగా తొమ్మిదో నంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా ప్రయాణించాలి.
గుంటూరు, తాడేపల్లి, సీతానగరంవైపు నుంచి వచ్చే వాహనాలు, పాదచారులను ప్రకాశం బ్యారేజీపైకి అనుమతించరు.
స్కవర్ గేట్ల మరమ్మతుల కోసమే..
ప్రకాశం బ్యారేజీ ప్రధాన గేట్లకు ఇరువైపులా ఉండే స్కవర్ గేట్ల మరమ్మతులకు ఇరిగేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. నదికి వరద ఎక్కువ వచ్చినప్పుడు ఇసుక, వండ్రు కొట్టుకొస్తోంది. ఇలాంటి సమయంలో గేట్లు తెరవాల్సి వస్తోంది. నదికి కృష్ణాజిల్లా వైపు ఆరు, గుంటూరు జిల్లా వైపు ఎనిమిది స్కవర్ గేట్లు ఉన్నాయి.
స్కవర్ గేట్లను 1998 తరువాత తీయలేదు. నీటి అడుగున ఉండటంతో గేట్లు బాగా తుప్పుపట్టిపోయాయి. వీటిని తరచూ తీయకపోవడంతో బ్యారేజీ ఎగువన రిజర్వాయర్‌లో ఇసుక నిండిపోతోంది. దీంతో ఈ ఏడాది స్కవర్ గేట్లు తీసి మరమ్మతులు చేయాలని, లేదంటే కొత్త గేట్లు ఏర్పాటుచేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు కేటాయించిన నిధుల్లోనే స్కవర్ గేట్ల మరమ్మతులకూ నిధులు కేటాయించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి పదిరోజుల్లో పూర్తిచేస్తారు. దీంతో బ్యారేజీపై రాకపోకలు నిషేధించారు.