విషాదం
విషాదం
Published Mon, Sep 4 2017 11:16 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
- జీవితంపై విరక్తి చెంది అన్నదమ్ముల ఆత్మహత్య
కోడుమూరు రూరల్: తల్లిదండ్రులు కన్నుమూశారు.. కట్టుకున్న భార్యలు విడిచి వెళ్లారు.. అప్పులకు ఆస్తులు కరిగిపోయాయి.. అక్కున చేర్చుకునే వారు కరువయ్యారు.. చివరకు వారికి మరణమే దిక్కైంది. ఒంటరి జీవితంతో మనస్తాపంతో చెందిన అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కోడుమూరులో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక కోటవీధికి చెందిన బచ్చం ఈశ్వర్‌రెడ్డి కుమారులు జగన్నాథరెడ్డి (48), మల్లికార్జునరెడ్డి (40) చెడు వ్యసనాలకు బానిసలై కుటుంబాలను పట్టించుకోలేదు. కట్టుకున్న భార్యలు వాళ్లని విడిచి పిల్లలతో పాటు వారి పుట్టినిళ్లకు వెళ్లిపోయారు. ఆస్తులన్నీ అప్పుల్లోకి జమయ్యాయి. ఉంటున్న ఇల్లును కూడా తాకట్టు పెట్టి అప్పు తీర్చుకున్నారు. అప్పు తీర్చకపోవడంతో అప్పుదారుడు ఇంటిని స్వాధీనం చేసుకొని తాళం వేశాడు. దీంతో రెండేళ్ల నుంచి ఇంటి కాపౌండ్‌లో ఉంటూ ఎవరైనా పెట్టింది తింటూ కాలం గడిపేవారు. చివరకు జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి వారుంటున్న మిద్దెపైన కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సోమవారం మధ్యాహ్నం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోడుమూరు సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ మహేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు జగన్నాథరెడ్డికి మొదటి భార్య చనిపోగా రెండో భార్య పావని, కుమార్తె, మొదటి భార్య కుమారుడు ఉన్నారు. అలాగే మల్లికార్జునరెడ్డికి భార్య సుమలత, ఇద్దరు కుమారులున్నారు. ప్రస్తుతం మృతుల అంత్యక్రియలు నిర్వహించేందుకు రావడానికి కూడా కుటుంబీకులు విముఖత చూపుతున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement