-
ఊరికో తరహా ప్యాకేజీతో మభ్యపెడుతున్న ప్రభుత్వం
-
స్పష్టత ఇవ్వని అధికార యంత్రాంగం
-
ఆందోళనలతో హోరెత్తుతున్న ముంపు మండలాలు
లక్షలాది ఎకరాలకు సాగు నీరందించనున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు అది. అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తూ.. సర్వం కోల్పోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఊరికో రకంగా పరిహారాన్ని ప్రకటిస్తూ.. గందరగోళం సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– కూనవరం
రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని అదే పనిగా చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు.. నిర్వాసితుల పరిహారంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం పునరావాసం, పునర్నిర్మాణ విషయాల్లో ప్రభుత్వం వద్ద స్పష్టత లేదని, చివరకు ప్యాకేజీ ఇవ్వకుండానే వెళ్లగొట్టినా ఆశ్చర్యమేమీ లేదని అఖిలపక్షం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలతో ముంపు మండలాలు హోరెత్తుతున్నాయి. అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు జెండాలు పక్కనపెట్టి, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ కోసం ఉద్యమ బాట పట్టాయి. కూనవరం, వీఆర్ పురం, నెల్లిపాక, చింతూరు మండలాల్లో నిత్యం పోరుబాటలు కొనసాగుతున్నాయి.
సేకరించిన భూమి 50 శాతానికి పైనే..
ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం, నిర్వాసితులకు పునరావాసం కింద సేకరించిన భూమి 50 శాతంపై చిలుకు ఉంది. 63 పంచాయతీలు కలిగిన నాలుగు విలీన మండలాల్లో 189 రెవెన్యూ గ్రామాలు, 329 హ్యాబిటేషన్లు ఉన్నాయి. 2008, 2010 లో రెండు దఫాలుగా రైతులకు ఇచ్చిన భూనష్ట పరిహారం సుమారుగా రూ.370 కోట్లు ఉంటుంది. 12 ఏళ్లలో పూర్తిస్థాయి భూసేకరణ చేపట్టని ప్రభుత్వం రెండేళ్లలో అన్నీ చేస్తోందన్న నమ్మకం లేదని నిర్వాసితులు చెబుతున్నారు.
స్పష్టత ఇవ్వని అధికారులు
పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం పనులను కూడా ఆ మేరకు వేగవంతం చేసింది. భారీ యంత్రాలు తెచ్చి, ముమ్మరంగా పనులు చేపట్టింది. పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా, ఊరికో ప్యాకేజీ ప్రకటిస్తూ నిర్వాసితులను ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పే మెరుగైన ప్యాకేజీ ఎలా ఉంటుందో స్పష్టం చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. పునరావాసం ఎక్కడ కల్పిస్తున్నారో, ఎన్ని ఎకరాల భూమి సేకరించారో స్పష్టం చేయాలంటున్నారు. ప్రతి కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఎంత, 18 ఏళ్లు నిండిన యువతకు, వ్యాపారులకు, చేతివృత్తుల వారికి ఇచ్చే ప్యాకేజీని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూ నష్టపరిహారంలో పట్టిసీమ, పోలవరం కుడికాలువ, కుక్కునూరు మండలాల్లో వెల్లడించిన ప్యాకేజీని కూనవరం, వీఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోనూ ప్రకటించాలని పట్టుబడుతున్నారు.
ముంపు కింద ఉన్న రైతుల భూములు 51,189 ఎకరాలు
రైతుల నుంచి సేకరించినది 32,683 ఎకరాలు
ఇంకా సేకరించాల్సినది 18,506 ఎకరాలు
కొత్తగా భూమిని నోటిఫై చేయాల్సిన గ్రామాలు 66
కొత్తగా 66 గ్రామాలు నోటిఫై
నాలుగు మండలాల్లో వివిధ కారణాలతో నోట్‌ఫై చేయని గ్రామాలు 66 వరకున్నాయి. వాటిని ఇప్పుడు నోట్‌ఫై చేస్తున్నాం. మొత్తం కలిపి మరో 12 వేల ఎకరాలు అదనంగా పెరిగే అవకాశం ఉంది. వాటిని సర్వే చేసి, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. పరిహారం ఎంత అనేది ప్రభుత్వ ఉత్తర్వులను బట్టి ఉంటుంది.
– ఎల్లారమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)