‘విద్యుత్‌’ బదిలీలపై సందిగ్థం | transco transfers | Sakshi
Sakshi News home page

‘విద్యుత్‌’ బదిలీలపై సందిగ్థం

Published Sat, Jun 24 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

transco transfers

  •  
  • మూడు జాబితాలు సిద్ధం చేసిన ఏపీఈపీడీసీఎల్‌
  •  ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగుల్లో అయోమయం 
  •  రెండు పంపిణీ సంస్థలకు ఒకేలా మార్గదర్శకాలు 
  •  ఒకే జాబితా తయారు చేసిన ఏపీఎస్‌పీడీసీఎల్‌  
  •  బదిలీలకు నేటితో ముగియనున్న గడువు 
  • సాక్షి, రాజమహేంద్రవరం:

    ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) బదిలీలపై ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సందిగ్థత నెలకొంది. శనివారంతో బదిలీల గడువు ముగుస్తున్నా ఏ ప్రాతిపదికన బదిలీలు చేస్తారన్న దానిపై ఇప్పటికీ ఉద్యోగులు ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. రాష్ట్రంలో దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదారి జిల్లాకు ఏపీఈపీడీసీఎల్, తిరుపతి కేంద్రంగా ఏపీఎస్‌పీడీసీఎల్‌ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. గత నెల 17వ తేదీన విద్యుత్‌ పంపిణీ సంస్థల్లోని ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టి ఈ నెల 15వ తేదీకి పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఆఫీస్‌ ఆర్డర్‌(టి.ఓ.ఓ) జారీ అయింది. అప్పుడే మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. వీటి ప్రకారం ఒక స్టేషన్‌లో ఐదేళ్లపాటు ఉన్న వారు, ఒక పోస్టులో మూడేళ్లపాటు కొనసాగిన కార్యాలయ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేయాలి. అదే సమయంలో మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలి. అందులోనూ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఫలితంగా దాదాపు 16 శాతం ఉద్యోగులు మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. 
    .
    మూడు జాబితాలు సిద్ధ చేసిన ఏపీఈపీడీసీఎల్‌... 
    రెండు పంపిణీ సంస్థల మధ్య మార్గదర్శకాల్లో వ్యత్యాసం, ఇతర కారణాల వల్ల సకాలంలో బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈ నెల 19వ తేదీన మరోసారి టీఓఓ జారీ చేశారు. ఈనెల 24వ తేదీకి బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే అర్హులైన ఉద్యోగులు సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటూ సాధ్యాసాధ్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూ డివిజన్లు, సర్కిల్‌ పరిధిలో డీఈలు, ఎస్‌ఈలు ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. అయితే రెండు సంస్థలకు ఒకే మార్గదర్శకాలు జారీ అయినా ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌లు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన సీనియారిటీ లిస్టులు సిద్ధం చేసిన వైనం భిన్నంగా ఉంది. ఏపీఈపీడీసీఎల్‌ స్టేషన్, పోస్టు సర్వీసు ఆధారంగా ఒకే లిస్టు తయారులు చేయగా ఏపీఈపీడీసీఎల్‌ స్టేషన్‌ పరిధి మేరకు ఒకటి, పోస్టులో సర్వీసు ఆధారంగా ఒకటి, స్టేషన్‌ పరిధి, పోస్టు సర్వీసు ఆధారంగా మరొకటి వెరసి మొత్తం మూడు లిస్టులు తయారు చేసింది. దీంతో ఏ లిస్టు ప్రాతిపాదికగా బదిలీలు చేస్తారన్న సందిగ్థం ఉద్యోగుల్లో నెలకొని ఉంది. 
    .
    ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో లిస్టులో మాయం...
    రాజమహేంద్రవరం సర్కిల్‌లో దాదాపు 2 వేల పోస్టులున్నాయి. ఇందులో దాదాపు 1600 మంది ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 400 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఒక స్టేషన్‌లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులందరూ ఒకటో లిస్టు, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి పని చేస్తున్న వారు రెండో లిస్టు, ఒకే స్టేషన్‌లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి ఉన్న వారందరూ మూడో లిస్టు ఏపీఈపీడీసీఎల్‌ తయారు చేసింది. అయితే ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో రెండు లిస్టుల్లో లేకపోవడంతో బదిలీ ఏ జాబితా ప్రకారం చేస్తారన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఉదహరణకు ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని రాజమహేంద్రవరం సర్కిల్‌ (తూర్పు గోదావరి జిల్లా మొత్తం)లోని ఓ విభాగంలో పని చేసే ఓ సీనియర్‌ ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఒకే స్టేషన్‌ (రాజమహేంద్రవరం)లో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగి పేరు స్టేషన్‌లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్ల సీనియారిటీ ప్రాతిపదికన తయారు చేసిన ఒకటో లిస్టులో లేదు. అదేవిధంగా ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులను ప్రాతిపదికగా తయారు చేసిన రెండో లిస్టులోనూ ఆ ఉద్యోగి పేరు లేదు. కానీ ఆ విభాగంలో మిగతావారి కన్నా ఆ ఉద్యోగి ఒకే స్టేషన్‌లో వివిధ క్యాడర్లలలో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. కానీ ఒకటి, రెండు జాబితాల్లో ఆ ఉద్యోగి పేరులేదు. మూడో జాబితాలో ఉంది. ఇప్పుడు ఏ జాబితా ప్రాతిపదికగా ఉద్యోగుల బదిలీ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఒకటో జాబితా ప్రాతిపదికగా చేస్తే ఒకే స్టేషన్‌లో 20 ఏళ్లు నుంచి ఉంటున్న ఆ ఉద్యోగి అక్కడే ఉంటారు. ఫలితంగా అతని కన్నా జూనియర్‌ బదిలీ అవుతారు. మూడు లిస్టులు రూపాందించిన ఏపీఈపీడీసీఎల్‌ దేని ప్రకారం ఉద్యోగులను బదిలీలు చేస్తారోనన్న ఆందోళనతో ఉన్నారు.
    సాధ్యాసాధ్యాల ఆధారంగా బదిలీ చేస్తాం...
    ఉద్యోగులు ఇచ్చిన మూడు ఆప్షన్లను పరిగణలోకి తీసుకున్నా సాధ్యాసాధ్యాలు, అవసరాల ప్రకారం బదిలీలు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి పనులతో కూడిన విధులు కాబట్టి పెట్టిన ఆప్షన్లు రాకపోవచ్చు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటాం. శనివారంతో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తాం. 
    – వైఎస్‌ఎన్‌ ప్రసాద్, సూపరింటెండెంట్‌ ఇంజినీరు, ఏపీఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం సర్కిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement