బదిలీ.. కాస్త రేటెక్కువ!
బదిలీ.. కాస్త రేటెక్కువ!
Published Mon, May 1 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
పోస్టింగ్స్ వీరికే ఇవ్వండి!
– జాబితాలను పంపుతున్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు
– పోస్టును బట్టి రేటు వసూలు చేస్తున్న కొద్దిమంది అధికారపార్టీ నేతలు
– ప్రతీ శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్న వైనం
- నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్న అధికారులు
- సీఐలు, ఎస్‌ఐల బదిలీల్లోనే ఇదే తరహా తంతు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీల వ్యవహారం అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది. భారీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో పోస్టింగుల కోసం రేటు కట్టి మరీ అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన బదిలీల్లో తాము సూచించిన వారికే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి పోస్టు(ఫోకల్) కోసం రెవెన్యూ, పోలీసు శాఖల్లో భారీగా డిమాండ్ ఉంది. దీంతో నేతలు అడిగిన మొత్తం ఇచ్చేందుకు కూడా ఆయా శాఖలకు చెందిన అధికారులు సిద్ధపడుతున్నారు. ఎవరు ఎక్కువ మొత్తం ఇస్తే వారికే పోస్టింగులకు అధికార పార్టీ నేతలు సిఫారసు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే/ఇన్‌చార్జి సిఫారసు లేఖలతో బదిలీల కోసం ఉద్యోగులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొద్ది మంది అధికార పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి తమ నియోజకవర్గాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పోస్టింగు కోసం తమ వద్దకు వస్తే.. ఆయా నియోజకవర్గ నేతలతో మాట్లాడి పోస్టింగులు ఇప్పిస్తున్నారు. మొత్తం మీద ఉద్యోగుల బదిలీల జాతర కాస్తా అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
పోస్టును బట్టి రేటు
అధికార పార్టీ నేతలు పోస్టులకు ఉండే డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయిస్తున్నారు. మంచి ఆదాయం ఉన్న పోస్టులకు భారీగా ధర నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక ఆదాయం ఉన్న ప్రాంతాల్లో ధర మరీ ఎక్కువ పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో సీఐల పోస్టింగుల కోసం ఏకంగా రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక ఎస్‌ఐల బదిలీలపైనా జోరుగా పైరవీలు జరుగుతున్నట్టు సమాచారం. తమకు కావాల్సిన పోస్టు కోసం కొద్ది మంది అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పోస్టును బట్టి సదరు నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూలోనూ ఇదే తంతు నడుస్తోంది. వ్యవసాయశాఖతో పాటు ఇతర అన్ని శాఖల బదిలీల్లోనూ ఇదే వ్యవహారం జరుగుతోంది. ఈ విధంగా అన్ని శాఖల ఉన్నతాధికారులకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల నుంచి బదిలీల జాబితా అందుతున్నట్టు తెలుస్తోంది.
అక్కడా పోస్టులు ఇప్పిస్తాం!
తమ నియోజకవర్గంలోని పోస్టింగులతో పాటుగా ఇతర నియోజకవర్గాల్లో కూడా కొందరు నేతలు వేలు పెడుతున్నట్టు చర్చ జరుగుతోంది. ఇతర నియోజకవర్గాల్లోనూ తమకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేలతో సిఫారసు చేయించుకుని మరీ పోస్టింగులు ఇప్పిస్తామని తమ వద్దకు వచ్చే వారికి చెబుతున్నారు. ఇందుకోసం వసూలు చేస్తున్న మొత్తంలో చెరీ సగాన్ని పంచుకుతినేందుకు సిద్ధమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ బదిలీ వ్యవహారంలో ఈ విధంగా ఒక ఇన్‌చార్జి రూ.5 లక్షలు తీసుకుని మరీ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే వద్దకు పంపి సిఫారసు లేఖ ఇప్పించినట్టు సమాచారం. సదరు ఎమ్మెల్యేకు కూడా రూ.10 లక్షల వరకూ ముట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే బదిలీల వ్యవహారంలో ఈ విధంగా చేదోడువాదోడుగా మరింత ఎక్కువ మొత్తం సంపాదించుకునేందుకు అధికారపార్టీ నేతలు సిద్ధమవుతున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది.
Advertisement
Advertisement