బెల్లంపల్లి ఏసీపీపై బదిలీ వేటు | Transfer to Belappalli ACP | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి ఏసీపీపై బదిలీ వేటు

Published Tue, Aug 15 2017 1:12 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

బెల్లంపల్లి ఏసీపీపై బదిలీ వేటు - Sakshi

బెల్లంపల్లి ఏసీపీపై బదిలీ వేటు

పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ మెమో
ఏసీపీ సతీష్‌ బదిలీలో రాజకీయ జోక్యం?
ఆరోపణల వెనుక వెలుగుచూడని మరో కోణం!
అక్రమార్కులకు అండ, నకిలీ పత్తి విత్తన వ్యాపారులతో మైత్రి ఆరోపణలు
రామగుండం కమిషనర్‌ దుగ్గల్‌ విచారణ..ప్రభుత్వానికి నివేదిక
మంచిర్యాల ఏసీపీ చెన్నయ్యకు అదనపు బాధ్యతలు


మంచిర్యాల: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే వివాదాస్పద అధికారిగా వార్తల్లోకెక్కిన బెల్లంపల్లి అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ (ఏసీపీ) సిహెచ్‌.సతీష్‌పై బదిలీ వేటు పడింది. సతీష్‌ను రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో మంచిర్యాల ఏసీపీ సిహెచ్‌.చెన్నయ్యకు బెల్లంపల్లి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని డీజీపీ కార్యాలయం ఓ మెమో ద్వారా తెలిపింది. కాగా పోలీస్‌ శిక్షణ కోసం 21 రోజుల పాటు మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్‌ వెళ్లిన ఏసీపీ సతీష్‌ తిరిగి వచ్చి విధుల్లో చేరినరోజే ఆయనపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశమైంది. అవినీతి, అక్రమాలకు అండగా నిలవడంతో పాటు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీపీ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూడకుండా ‘జిల్లా రాజకీయం’ పనిచేసిందని తెలుస్తోంది. సతీష్‌ను బలి చేయడానికి ఒక్కటైన యంత్రాంగం తమ అక్రమాలు వెలుగులోకి రాకుండా పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించినట్లు సమాచారం.

స్వయంకృతమా... రాజకీయమా..?
బెల్లంపల్లి ఏసీపీ సతీష్‌పై బదిలీ వేటు పడడం స్వయంకృతమా? బలమైన రాజకీయ కారణం ఉందా? అనే అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన వ్యవహా రశైలి వివాదాస్పదంగానే ఉంది. పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమార్కులకు అండగా ఉన్నట్లు సీఎం స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. అయినా ఆయనపై డీజీపీ అనురాగ్‌శర్మ ఎలాంటి చర్యలూ తీసుకోలే దు. అంతా సద్దుమనిగిందని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా బదిలీ వేటు పడడం చర్చకు కారణమవుతోంది. జూన్‌ ఆఖరి వారంలో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తగా విచారణ అధికారిగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ వ్యవహరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే ఆరోపణలతో అట్టుడికినప్పుడు పోలీస్‌ శాఖ ఏసీపీ సతీష్‌ విషయంలో స్పం దించలేదు. ఆయన జూలై 24న షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీలో 21 రోజుల శిక్షణ పూర్తిచేసుకొని ఈనెల 11న తిరిగి వచ్చారు. సోమవారం డ్యూటీలో చేరిన రోజే బదిలీ వేటు వేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీ వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు బడా వ్యక్తులను కాపాడడానికి ఏసీపీని బలిచేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

పకడ్బందీ వ్యూహమా..?
బెల్లంపల్లి ఏసీపీ పరిధిలోకి మందమర్రి మునిసిపాలిటీ కూడా వస్తుంది. బెల్లంపల్లి, మందమర్రిలో జరిగే అవినీతి, అక్రమ కార్యకలాపాలు, రియల్‌ ఎస్టేట్, ఇసుక దందా, ప్రజాప్రతినిధుల పేరుతో సాగే ఆగడాల విషయంలో ఏసీపీ వ్యవహారశైలి ఎవరికీ అంతు చిక్కలేదు. సుమారు కోటి రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలను మందమర్రి మండలం గద్దెరేగడి సమీపంలో సీజ్‌ చేసిన కేసులో తొలిసారి ఏసీపీ వివాదంలోకి వచ్చారు. ఈ కేసులో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణతో ఏసీపీపై ఉచ్చు బిగిసింది. దీనికితోడు ఓ పెట్రోల్‌బంక్‌ యజమాని నుంచి లక్షలు వసూలు చేశారని, డబ్బులు ఇవ్వని మరో పెట్రోల్‌బంక్‌ యజమానిని కేసుల్లో ఇరికించారని ఆరోపణలు వచ్చాయి. ఏసీపీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో గిట్టని వారిని వేధించినట్లు కూడా విమర్శలున్నాయి.

ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధించడం, ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా ఉండడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో పలు అంశాల్లో ఫిర్యాదులు ఎదుర్కొన్న బడా వ్యక్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఎదురైంది. సతీష్‌ సతీమణి కవిత జైపూర్‌ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె జైపూర్‌ పరిధిలో అక్రమార్కుల వెన్నులో చలి పుట్టించారు. ఇసుక దందా చేసే బడా డాన్‌ల మీదే కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నూర్‌లో ఇసుక మాఫియా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ‘మరోవైపు నుంచి నరుక్కువచ్చే’ సూత్రాన్ని పాటించి సతీష్‌ను మానసికంగా దెబ్బతీసేలా దాడి చేసినట్లు పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. సతీష్‌ బదిలీ వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement