ఏసీ టికెట్లు బుక్ చేస్తే.. నాన్ ఏసీలో పంపారు!
బోధన్ (నిజామాబాద్): ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ నిర్వాకం యాత్రికులను అవస్థల పాలు చేసింది. అటవీ ప్రాంతంలో మూడు గంటలు నడిరోడ్డుపై పడిగాపులు గాయాల్సిన అవస్థ ఎదురైంది. దీనికి సంబంధించిన హైదరాబాద్, గుంటూరు ప్రాంతాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డి సాయిబాబా ఆలయానికి వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కోసం షిర్డీలోనే ఖురానా అనే ట్రావెల్ సంస్థలో ఏసీ సర్వీసులో టికెట్లు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2వేలకు పైగా వసూలు చేశారు. శనివారం రాత్రి 8.30 గంటలకు సర్వీసు బయలుదేరింది.
ఆదివారం ఉదయం 10.30 గలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన సర్వీసును నాందేడ్ జిల్లా నర్సి గ్రామం శివారులో ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిలిపి వేశాడు. అటవీ ప్రాంతంలో మూడు గంటల పాటు బస్సును నిలిపివేయడంతో పిల్లలు, మహిళలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ సర్వీసుకు తెలంగాణలో ప్రవేశానికి పర్మిట్ లేకపోవడంతో... అదే ట్రావెల్స్ సంస్థకు చెందిన మరో బస్సును హైదరాబాద్ నుంచి రప్పించి అందులోకి ఎక్కించారు. ఏసీ సర్వీసుకు టికెట్లు బుక్ చేసుకుంటే నాన్ ఏసీ బస్సులో అక్కడి నుంచి పంపించారు. దీంత ట్రావెల్స్ యాజమానిపై చర్యలు తీసుకోవాలని సాలూర అంతరాష్ట్ర ఆర్‌టీవో చెక్‌పోస్టులో అధికారికి ఫిర్యాదు చేశారు.