వైద్యంలో ఒరవడి
Published Sat, Jul 30 2016 5:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వైద్య రంగం సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నదని ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. అత్యాధునిక వైద్యాన్ని ప్రజల ముంగిటకు తీసుకెళ్లడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా అవయవదానాల్లో, మార్పిడి శస్త్ర చికిత్సల్లో దూసుకెళుతున్నామన్నారు. గ్లోబల్ హెల్త్ సిటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీఐ అండ్ హెచ్‌పీబీ సర్జరీస్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో గ్లోబల్ గ్యాస్ట్రో అప్ డేట్స్ అనే అంశంపై అవగాహన సదస్సు ప్రారంభమైంది. రెండు రోజల పాటు సాగనున్న ఈ సదస్సుకు తొలి రోజు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు వైద్య రంగంలో సరికొత్త మెళుకువలకు, నాణ్యత పెంపునకు దోహద పడతాయని వివరించారు. గ్లోబల్ హెల్త్ సిటీలో శస్త్ర చికిత్సల పరంగా సమష్టిగా వైద్య నిపుణులు ముందుకు సాగుతున్నారని పేర్కొంటూ, సమష్టిగా పనిచేయడం ద్వారా అవయవమార్పిడి శస్త్ర చికిత్సలను మరింతగా ముందుకు దూసుకెళ్లడానికి వీలుందన్నారు. ఇక్కడ సాగుతున్న వీడియో లెక్చర్‌ను చూస్తుంటే, ఒక్కో శస్త్ర చికిత్స ఒక్కో విధంగా ఉన్నాయని వివరిస్తూ, ఇలాంటివి యువ, జూనియర్ డాక్టర్లకు అవగాహనా పరంగా అనుభవాన్ని నేర్పుతాయని వ్యాఖ్యానించారు. వైద్యపరంగా మేధాసంపతిని మరింత పెంచుకోవడంతో పాటు, మెరుగైన వైద్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళదామని పిలుపునిచ్చారు. గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కే రవీంద్రనాథ్ మాట్లాడుతూ దక్షిణ భారతంలోని దాదాపుగా రెండు వందల యాభై మందికి పైగా వైద్యులు ఈ సదస్సుకు హాజరు అయ్యారని పేర్కొన్నారు. అన్న వాహిక, పెద్ద ప్రేగు, ఉదర కోశ, కాలేయ సంబంధిత రోగాలు, చేపట్టిన శస్త్ర చికిత్సల గురించి వీడియో లెక్చర్ అందిస్తున్నామని, అలాగే, అత్యాధునిక వైద్య పరికరాలను గురించి వివరించడం జరుగుతున్నన్నారు. ఉబకాయం కాలేయ క్యాన్సర్ తదితర వ్యాధులకు ఆధునికతతో సాగుతున్న కీ హోల్ సర్జరీ గురించి తెలియజేస్తామని తెలిపారు. తమ హెల్త్ సిటీలో అవయవమార్పిడి శస్త్ర చికిత్సల వేగం పెరిగాయని గుర్తు చేస్తూ, ఈ సదస్సు ద్వారా ముప్పై ఐదు రకాల శస్త్ర చికిత్సల గురించి వివరించనున్నామన్నారు. గ్లోబల్ ఆసుపత్రి ఓ వైద్య విజ్ఞాన సంస్థగా రూపొందుతున్నదని వివరిస్తూ, శస్త్ర చికిత్సల్లోనే కాదు, ప్రత్యేక పరిశోధనలు, బోధనలు, యువ వైద్యులకు ప్రత్యేక శిక్షణతో సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సదస్సులో వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి, డాక్టర్ వైదీశ్వరన్, డాక్టర్ శ్రీకాంత్, ప్రొఫెసర్ మహేష్‌సుందరం, రవిచంద్రన్ వైద్య విధాన, శస్త్ర చికిత్సల పరంగా ఒక్కో అంశాన్ని విశదీకరించారు.
Advertisement
Advertisement