పాఠశాల కోసం చెంచు పిల్లల ధర్నా
Published Tue, Jan 17 2017 12:12 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
కర్నూలు (న్యూసిటీ): చదువుకోవడానికి తమకు పాఠశాల ఏర్పాటు చేయాలని కర్నూలు నగరం న్యూ శ్రీనివాసనగర్‌కు చెందిన చెంచు పిల్లలు.. మాలమహానాడు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మాలమహానాదు రాయలసీమ అధ్యక్షుడు నాగరాజు, డీబీఆర్‌సీ కో ఆర్డినేటర్ వేల్పుల జ్యోతి మాట్లాడుతూ.. చెంచు పిల్లలు ప్లాస్టిక్ కవర్లు తదితర వాటిని ఏరుకొని.. వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నారన్నారు. న్యూ శ్రీనివాసనగర్‌లో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వాలన్నారు. చీరలతో గుడారాలు కట్టుకొని జీవనం చేస్తున్నారని.. పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ధర్నాలో చెంచురంగన్న, చెంచు సుంకన్న, చెంచు మారెన్న, సుజనమ్మ, మధు, మద్దిలేటి పాల్గొన్నారు.
Advertisement