విల్లంబులతో గిరిజనుల నిరసన ప్రదర్శన
విల్లంబులతో గిరిజనుల నిరసన ప్రదర్శన
Published Mon, Nov 21 2016 11:54 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
కాకినాడ సిటీ: అటవీ హక్కుల చట్టంను అమలు చేయాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అనుబంధ ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం కాకినాడలో విల్లంబులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక శాంతిభవన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం కలెక్టరేట్ ఎదుట విల్లంబులు చేతబూని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఆదివాసి హక్కులను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. గిరిజనుల సాగులో ఉన్న కొండపోడు భూములకు డివిజన్, జిల్లాస్థాయి జాయింట్ సర్వేలు జరిపి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, గిరిజనుల సాగులో ఉన్న రెవెన్యూ, కొండపోడు భూములను తక్షణం గుర్తించి పట్టాలు మంజూరు చేయాలని, కులధ్రువీకరణ పత్రాల మంజూరులో జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, గిరిజన గ్రామాల్లో వలసపెత్తందార్ల ఆదిపత్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు జె.నాగేశ్వరరావు, రేచుకట్ల సింహాచలం, వ్యవసాయగ్రామీణ సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.అర్జునరావు, ఏఐసీసీటీయు రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ నాగేశ్వరరావు, నాయకులు పి.నరసరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement