మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
-
భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కోవడం అన్యాయం
-
అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం
-
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
వాగొడ్డుగూడెం(అశ్వారావుపేట రూరల్): పోడుసాగు విషయంలో గిరిజనులు, పేదలు చేస్తున్నది.. ధర్మ పోరాటమని, రాష్ట్రప్రభుత్వం చేస్తున్నది.. ఆ ధర్మమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మండలంలోని వాగొడ్డుగూడెం పోడుభూముల్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు పంపిణీ చేయకపోగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. గిరిజనులకు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని నిబంధనలున్నాయని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 2005 కంటే ముందుగానే సాగులో ఉన్న భూములను లాక్లోవడం మానుకోవాలన్నారు. దీనిపై గిరిజనులు చేస్తున్న ధర పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందన్నారు. పట్టాలు ఉన్న ఐదు లక్షల ఎకరాలను అన్యాయంగా గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అనంతరం పోడు కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చిన 120 మంది గిరిజనులను పరామర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, నాయకులు ఏజే రమేష్, ఐలయ్య, డివిజన్ నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, ధర్ముల సీతారాములు, చిరంజీవి, ప్రసాదు, కుంజా మురళీలున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా :
సున్నం రాజయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం
పోడు భూముల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. పోలీస్, అటవీ అధికారులు వ్యవహారిస్తున్న తీరు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తానన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పోడు జోలికి వెళ్లమని చెప్పిన ప్రభుత్వ తీరును ఎండగడతానన్నారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ముగ్గురు మంత్రులు కూడా పోడు జోలికి వెళ్లవద్దని అధికారులకు చెప్పి.. దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.