
టీఆర్ఎస్ ‘తీన్’మార్
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలో టీఆర్‌ఎస్ ఘన విజయం
♦ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలో ఘన విజయం
♦ వరంగల్‌లో 58 డివిజన్లకు 44 డివిజన్లలో జయకేతనం
♦ ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఖాతాలోకి 34 డివిజన్లు
♦ అచ్చంపేటలో అన్ని స్థానాలు క్లీన్‌స్వీప్
♦ మూడు చోట్ల ఖాతా కూడా తెరవలేకపోయిన టీడీపీ
♦ వరంగల్, ఖమ్మంలో తొలిసారి మేయర్ పగ్గాలు చేపట్టనున్న అధికార పార్టీ
గ్రేటర్ వరంగల్ (58 డివిజన్లు)
టీఆర్‌ఎస్ 44
కాంగ్రెస్ 4
బీజేపీ 1
సీపీఎం 1
స్వతంత్రులు 8
ఖమ్మం (50 డివిజన్లు)
టీఆర్‌ఎస్ 34
కాంగ్రెస్ 10
వైఎస్సార్ సీపీ 2
సీపీఎం 2
సీపీఐ 2
అచ్చంపేట నగర పంచాయతీ (20 వార్డులు)
టీఆర్‌ఎస్ 20
మహాకూటమి 0
సాక్షి, వరంగల్/ఖమ్మం/అచ్చంపేట/హైదరాబాద్: గులాబీ మరోసారి గుబాళించింది. పుర ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లపై తొలిసారి గులాబీ జెండా ఎగరేసింది. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలో క్లీన్‌స్వీప్ చేసి ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో నిలిచింది. ఈ మూడు పురపాలికలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 58 డివిజన్లలో టీఆర్‌ఎస్ ఏకంగా 44 డివిజన్లలో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందడం గమనార్హం. బీజేపీ, సీపీఎంలు ఒక్కో డివిజన్‌లో గెలిచాయి. ఇక ఖమ్మం కార్పొరేషన్‌లోని 50డివిజన్లలో టీఆర్‌ఎస్ 34 డివిజన్లలో నెగ్గింది. కాంగ్రెస్ 10, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2, సీపీఎం 2, సీపీఐ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అచ్చంపేట నగర పంచాయతీలో విజయం పూర్తిగా ఏకపక్షమైంది. ఇక్కడ 20కి 20 వార్డులను టీఆర్‌ఎస్ తన ఖాతాలో వేసుకుంది. వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం గమనార్హం.
వరంగల్‌లో రెబల్సే పోటీదారులు
వరంగల్ మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ తొలిసారి దక్కించుకోనుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు టీఆర్‌ఎస్‌కు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయాయి. టీఆర్‌ఎస్ టికెట్ దక్కని వారే పార్టీకి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. వరంగల్‌కు ‘గ్రేటర్’ హోదా వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు 44 చోట్ల నెగ్గగా.. ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు 8 డివిజన్లలో విజయం సాధించారు. రెబల్స్‌గా బరిలో దిగినా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంతో వారంతా టీఆర్ ఎస్ సభ్యులుగానే కొనసాగే వీలుంది. గతంలో ఎప్పుడూ లేనంత దారుణంగా కాంగ్రెస్ కేవలం 4 డివిజన్లకు పరిమితమైంది. గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నిక ఈ నెల 15న జరగనుంది. మేయర్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించారు.
ఖమ్మంలో నల్లేరుపై నడకే..
ఖమ్మంలో విపక్షాల నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించినా పరిస్థితి అలా కనిపించలేదు. కాంగ్రెస్ 10 స్థానాల్లో నెగ్గి పరువు దక్కించుకున్నా.. 48 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. ఓట్ల లెక్కింపులో మొదట్నుంచీ గులాబీ పార్టీ మెజారిటీ కనబరచడంతో.. ఒక దశలో ఆ పార్టీకి 40 స్థానాలు వస్తాయని భావించారు. అయితే రెండు, మూడు రౌండ్లలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ కొన్ని డివిజన్లు దక్కించుకోవడంతో టీఆర్‌ఎస్ 34 డివిజన్లకు పరిమితమైంది. ఖమ్మంలో కాంగ్రెస్.. సీపీఐతో పొత్తు పెట్టుకోగా, మిగతా పార్టీలన్నీ ఒంటరిగా బరిలో నిలిచారుు. 2005లో ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పొత్తుతో వెళ్లాయి. అప్పట్లో మొత్తం 41 వార్డులకు కాంగ్రెస్ 9, సీపీఎం 18, సీపీఐ 2, టీడీపీ 12 వార్డులు దక్కించుకున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే టీఆర్‌ఎస్ పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. మేయర్ పదవిని ఎస్టీ(జనరల్) అభ్యర్థికి రిజర్వ్ చేశారు.
‘అచ్చ’మైన విజయం
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా పోటీ చేసినా.. టీఆర్‌ఎస్ ముందు నిలవలేకపోయాయి. ఇక్కడ 20కి 20 వార్డుల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. నగర పంచాయతీలో 18,614 మంది ఓటర్లు ఉండగా... ఈ నెల 6న జరిగిన పోలింగ్‌లో 13,193 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 85 మంది నోటాకు ఓటేశారు. ఓట్ల లెక్కింపు ఐదురౌండ్లతోనే పూర్తయింది. 8, 9, 14 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మహాకూటమి అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. ఈ వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు కేవలం 32, 33, 68 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
విజేతలకు కేసీఆర్ శుభాకాంక్షలు
వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలో పార్టీకి అపూర్వ విజయం అందించిన ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం సీఎంను కలిశారు. వీరిని అభినందించిన కేసీఆర్.. ‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లు దీవించారు. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అభినందనలు’’ అని పేర్కొన్నారు.
ఫలించిన మంత్రుల వ్యూహం
రెండు కార్పొరేషన్లు, నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే టీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో వ్యవహరించింది. ఈ మూడు చోట్లా ఎన్నికలు ఖాయమని తేలాక డివిజన్ల వారీగా సర్వేలు చేయించింది. ఎన్నికల ప్రకియ మొదలయ్యే సరికి అధికార పార్టీ కనీసం అయిదు సర్వేలు చేయించిందని సమాచారం. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థులను బరిలోకి దించింది. మూడుచోట్లా ఆయా జిల్లాల మంత్రులకు ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పింది. మొదట్లో వరంగల్ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చూసినా.. రెబల్స్ బెడద పెరగడం, చివరకు ఎమ్మెల్యేలు కూడా అలక బూనడంతో సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌ను బరిలోకి దించారు. ప్రచారం చివరి రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొని నగర అభివృద్ధికి హామీలు ఇచ్చారు. ఇక ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల బాధ్యతలు చూశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ఎన్నిక బాధ్యతలను చూశారు.