విద్యార్థి కిడ్నాప్‌నకు యత్నం
విద్యార్థి కిడ్నాప్‌నకు యత్నం
Published Sat, Dec 10 2016 10:06 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
– మత్తుమందు ఇచ్చి తీసుకెళ్లిన దుండగులు
– స్పృహ వచ్చిన తరువాత తప్పించుకున్న విద్యార్థి
– యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వెంకటరమణ కాలనీలోని రవీంద్రభారతి పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. మత్తు మందు ఇచ్చి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో స్కృహలోకి రాగానే తప్పించుకొని ఆ విద్యార్థి ఇంటికి చేరాడు. అయితే విద్యార్థి కనిపించకుండా నాలుగైదు గంటలు గడిచినా యాజమాన్యం తల్లిదండ్రులకు తెలపకపోవడం గమనార్హం. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు..చిన్నటేకూరుకు చెందిన కల్యాన్, రేవతి దంపతుల కుమారుడు వెంకటేష్..రవీంద్రభారతి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలకు మైదానం లేకపోవడంతో ప్రతీ శనివారం విద్యార్థులను బస్సులో అవుట్ డోర్ స్టేడియానికి తీసుకెళ్లి ఆటలు ఆడిస్తారు. అందులో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు విద్యార్థులను స్టేడియానికి తీసుకెళ్లారు. వెంకటేష్‌కు తలనొప్పి ఉండడంతో ఆటలు ఆడకుండా పక్కన కూర్చున్నాడు. ఇంతలోనే ఆ విద్యార్థిపై మెడపై ఇద్దరు వ్యక్తులు చేయివేసి అరవకుండా మూతికి బట్టను అడ్డంగా పెట్టి మత్తు మందును ఇచ్చి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుత్తి పెట్రోల్ బంకు వరకు తీసుకెళ్లారు. అక్కడ ఆ విద్యార్థికి స్పృలోకి వచ్చాడు. వెంటనే వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. అక్కడి నుంచి వెంటనే ఆటోలో నాలుగున్నర గంటలకు ఇంటికి చేరి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు.
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
వెంకటేష్‌ను కిడ్నాప్ చేశారన్న విషయాన్ని నాలుగైదు గంటలైనా తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తెలపలేదు. కనీసం పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు వెంకటేష్ ఎక్కడ ఉన్నాడో యాజమాన్యానికి తెలియదు. అయితే ఆరున్నర గంటల సమయంలో తండ్రి కల్యాణ్ ఇంటికి వచ్చిన కుమారుడి తీసుకొని జరిగిన సంఘటనపై వివరాలను తెలుసుకునేందుకు పాఠశాలకు వెళ్లాడు. అప్పుడు యాజమాన్యం హడావుడిగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఏదైనా హాని జరిగి ఉంటే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చివరకు ఎట్టకేలకు యాజమాన్యం, తల్లిదండ్రులు సంయుక్తంగా జరిగిన సంఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement