విద్యార్థిని కిడ్నాప్నకు యత్నించిన ఎస్సై
♦ స్థానికుల అప్రమత్తతతో బెడిసికొట్టిన వ్యూహం
♦ పోలీసుల అదుపులో కిడ్నాప్‌కు ప్రయత్నించిన మహిళ
రేపల్లె: సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన ఎస్సై విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. పట్టణ సీఐ వీ మల్లిఖార్జునరావు కథనం ప్రకారం బేతపూడి గ్రామానికి చెందిన జగన్మోహనరావు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ సెంటరు(పీటీసీ)లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. మల్లిఖార్జునరావుకు మండలంలోని బేతపూడి గ్రామానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులతో విభేదాలున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని పరిచయస్తురాలు ఒంగోలు లాయరుపేటకు చెందిన బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఈదుపల్లి సుధారాణి సాయంతో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు.
వారిద్దరూ శుక్రవారం పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థినిని పిలిపించి కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా విద్యార్థిని గట్టిగా కేకలు వేస్తూ స్కూల్లోకి పరుగెత్తింది. దీంతో స్థానికులు, ఉపాధ్యాయులు వ చ్చేసరికి జగన్మోనహనరావు, సుధారాణిలు పరారయ్యరు. ఉపాధ్యాయులు విద్యార్థిని బంధువులకు, పోలీసులకు సమాచారమిచ్చి స్థానికుల సాయంతో పాఠశాల పరిసరాల్లో వెతుకుతుండగా సుధారాణి వారి కంటపడింది. ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుధారాణి వివరాలు వెల్లడించింది. ఎస్సై జగన్మోహనరావు పరారీలో ఉన్నాడు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.