రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు అవుతది!
ఆర్థికంగా మన రాష్ట్రం పటిష్టంగా ఉంది
అప్పులడిగితే బ్యాంకులు క్యూ కడుతున్నయ్
మర్కూక్ మండల ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్
గజ్వేల్: ‘‘కొట్లాడి తెలంగాణ సాధించుకున్నం.. మనం అదృష్టవంతులం.. ఊహించిన దానికంటే మన రాష్ట్రం ఆర్థికంగా బాగుంది.. మనం అప్పు అడిగితే కమర్షియల్ బ్యాంకులు క్యూ కడుతున్నయ్.. మిషన్ భగీరథ కోసం అప్పు అడిగితే 20 రోజుల్లో రూ. 20 వేల కోట్లు ఇచ్చిండ్రు. ఆర్థిక నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి 2024 నాటికి మన బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరుకోబోతుంది’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మర్కూక్ మండల కేంద్రాన్ని కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మంచినీళ్లు, సాగునీటి రంగం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు పూర్తయ్యాక.. నిధులన్నీ పేదరిక నిర్మూలనకు వినియోగిస్తామన్నారు. ఈ మధ్యకాలంలో గవర్నర్ నరసింహన్ తో కలిసిన సందర్భంలో.. ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటారు..? అంటూ ప్రశ్నించగా.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అవసరమైన సూక్ష్మస్థారుు ప్రణాళికను.. కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలు చేస్తామని చెప్పగా.. గవర్నర్ తనకు ఆశీర్వాదాన్ని అందజేశారన్నారు.
కరెంటును మరో గంట పెంచుతం...
‘ఇప్పుడు వానలు గట్టిగ పడ్డయ్. ఇక చాలు తల్లీ అనేదాక వానలు పడ్డయ్. గిప్పుడు రెం డోది బలమైన పంట పండించుకోవాలె.. 9 గంటల కరెంటును అవసరమైతే మరో గంట పెంచుతం’ అని సీఎం అన్నారు. ‘మర్కూక్ పక్కన 10 లేదా 20 టీఎంసీల కొండపోచమ్మ రిజర్వాయర్ రాబోతుంది. దీని ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందించబోతున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
ప్రతి రూపాయి లబ్ధిదారులకు చేరాలి..
‘కొత్త జిల్లాలు తమాషా కోసం కాదు... ఈ రోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా దానివెంట పైరవీకారులు పుట్టుకొస్తుండ్రు. చిట్టచివరి రూపాయి... చిట్ట చివరి లబ్ధిదారుని వరకు చేరాలి. ఇదే ఈ కొత్త జిల్లాల లక్ష్యం. ఒక్కో జిల్లాలో 2 లక్షల నుంచి మొదలుకుని 4 లక్షల కుటుంబాలు మాత్రమే ఉండాలె. అలా ఉన్నప్పుడు ప్రతి కుటుంబం స్థితిగతులు ప్రభుత్వానికి తెలిసే అవకాశముంది. ఈ కుటుంబాల లెక్కలన్నీ కలెక్టర్ వద్ద ఉంటారుు’ అని సీఎం తెలిపారు. కేసీఆర్ ఎరవ్రల్లి మీద ఏ రకంగా ప్రేమ, వాత్సల్యం చూపుతున్నారో.. అదే రకమైన దయ తమ గ్రామంపై చూపాలని సరస్వతీ ఉపాసకులు, మర్కూక్ గ్రామ వాస్తవ్యులు దైవజ్ఞశర్మ కోరారు. దీనిపై స్పందించిన సీఎం... దైవజ్ఞశర్మ చాలా హుషారున్నరు.. ఆయన విజ్ఞప్తి మేరకు మండల కేంద్రానికి ఒప్పుకున్నా.. ఇప్పుడు మళ్లా మీ గ్రామాన్ని ఎర్రవల్లి లెక్క జేయమంటుండ్రు.. అంటూ చమత్కరించారు.
మర్కూక్‌లో ప్రారంభోత్సవాలు..
మర్కూక్‌లో తహసీల్దార్, పోలీస్ స్టేషన్, మం డల పరిషత్ కార్యాలయాలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, సలీంపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నేనూ ఇక్కడి బిడ్డనే..
‘నేనూ ఇక్కడి బిడ్డనే. తెలంగాణ కష్టాల్లో ఉంది.. నువ్వు బయటకు వెళ్లి తీరాలంటూ సిద్దిపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి పంపించిండ్రు.. వారిచ్చిన ఆశీర్వాదంతో 14 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడిన.. చివరకు తెలంగాణ సాధించినం. తెలంగాణ వచ్చినందునే మన చేతుల్లో శక్తి ఉంది. ఇవాళ మర్కూక్‌ను మండలం చేసుకోగలిగినం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘నేనూ ఇకనుంచి ఈ మండల పరిధిలోకే వస్తున్నా.. ముఖ్యమంత్రి మండలం మంచిగా ఉండాలె. నీ మండలమే సక్కగ లేదు.. నువ్వు మాకేం జేస్తవ్.. అని ప్రశ్నించే పరిస్థితి రావొద్దు. మర్కూక్‌ను సైతం బంగారు మండల కేంద్రంగా తీర్చిదిద్దుతా.. ఇక్కడ మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నా. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఈ గ్రామంలో పాదయాత్ర చేసి ఇక్కడ కల్పించాల్సిన వసతులపై సర్వే జరుపుతారు. దీన్నిబట్టి తదుపరి చర్యలు తీసుకుందాం’ అని కేసీఆర్ అన్నారు.