రేపటి నుంచి టీటీ టోర్నమెంట్
Published Wed, Oct 26 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
భీమవరం: భీమవరంలో తొలిసారిగా నాల్గో ఏపీ స్టేట్ రాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ గురువారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తామని ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.విశ్వనాథరావు చెప్పారు. స్థానిక కాస్మో పాలిటన్ క్లబ్‌లో మంగళవారం టోర్నమెంట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మెన్, ఉమెన్, యూత్, జూనియర్, సబ్ జూనియర్, క్యాడెట్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. సీనియర్ టేబుల్ టెన్నిస్ కోచ్ వీఆర్ ముక్కామల చీఫ్ రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. భీమవరం వంటి పట్టణంలో పోటీలు నిర్వహించడంతో జిల్లాలో టేబుల్ టెన్నిస్‌కు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని, వారికి పూర్తిస్థాయిలో భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, టి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Advertisement