
వీరీవీరీ వీడియో సీన్...వీరి పేరేమీ..?
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో గత నెల 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా
‘తుని’ ఘటనకు బాధ్యుల్ని నిర్ధారించే పనిలో రెవెన్యూ, పోలీసు శాఖలు
గత నెల 31 నాటి వీడియోలు, ఫొటోలు, సెల్ఫీల సేకరణ
అమలాపురం కిమ్స్‌లో డివిజన్‌లోని వీఆర్వోలకు ప్రదర్శన
అమలాపురం టౌన్/ అమలాపురం రూరల్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో గత నెల 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జరిగిన విధ్వంసకర ఘటనలకు సంబంధించి ఇప్పటికే పోలీసు శాఖ వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలను సేకరించింది. నాటి దృశ్యాలను అక్కడున్న వీడియోగ్రాఫర్లే కాక కొందరు కొందరి వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్లతో చిత్రీకరించారు. మరికొందరు ఆ దృశ్యాలను సెల్ఫీలతో బంధించారు. తుని ఘటన నాటి నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం ఆ రోజు విధ్వంసకర సంఘటనలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు సేకరిస్తూనే ఉంది.
ఇప్పటికే నాటి ఘటనల్లోప్రత్యక్షంగా, ప్రముఖంగా కనిపించిన కాపు నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి విధ్వంసంలో మరీ విచక్షణారహితంగా అల్లర్లకు పాల్పడిన యువకులను వీడియోలు, ఫొటోల్లో గుర్తించినప్పటికీ వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వంటి సమాచారం లభ్యం కావటం లేదు. వారిని గుర్తించి తగిన ఆధారాలతో కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వ ఒత్తిడితో పోలీసుశాఖ నడుం బిగించింది. దీంట్లో భాగంగానే ఆ వీడియోలు, ఫోటోలు, సెల్ఫీలను పోలీసుశాఖ ఆయా రెవెన్యూ డివిజన్లకు పంపి, గ్రామస్థాయిలో విధులు నిర్వర్తించే వీఆర్వోలకు చూపి, వారెవరో గుర్తించే బాధ్యతను రెవెన్యూ, పోలీసు విభాగాల డివిజన్ స్థాయి అధికారులకు ఉమ్మడిగా అప్పగించారు. ఈ క్రమంలోనే కాపు ఉద్యమాలు చురుకుగా జరిగిన ప్రాంతాలకు వీడియోలు, ఫొటోలు పంపించి వీఆర్వోలతో విధ్వంసానికి బాధ్యులను గుర్తించే కసరత్తు జరుగుతోంది.
ఆర్డీఓ, డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రదర్శన..
జిల్లాలో కాపు ఉద్యమాలకు సంబంధించి కోనసీమ.. అందులోనూ అమలాపురం ప్రాంతాలు చాలా వరకూ కీలకంగానే వ్యవహరించాయి. దీంతో వీడియోలు, ఫొటోల గుర్తింపు ప్రక్రియను జిల్లాలో అమలాపురం డివిజన్ నుంచే మొదలు పెట్టారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో డివిజన్‌లోని 275 గ్రామాల వీఆర్వోలతో గురువారం ఉదయం ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వారికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాటి తుని విధ్వంసకర దృశ్యాలు, అల్లర్లకు పాల్పతున్న ఆందోళనకారులను చూపించారు. అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.
సందిగ్ధంలో వీఆర్వోలు
తుని విధ్వంసకర దృశ్యాలను తెరపై చూసిన డివిజన్ వీఆర్వోల్లో సందిగ్ధంలో చిక్కున్నారు. ఒకవేళ వీడియోల ఆధారంగా ఎవరినైనా గుర్తిస్తే పోలీసులు తమతోనే ఫలానా వ్యక్తిపై ఫిర్యాదు రాయించి, కేసులు నమోదు చేస్తే గ్రామాల్లో వారికి శత్రువులై, వ్యక్తిగతంగా లక్ష్యం అవుతామన్న జంకు వారిని పీడిస్తోంది. కొందరు వీఆర్వోలు నిందితులను గుర్తించే పని పోలీసు వారిదేనని, ఇందులో తమను ఇరికించటమేమిటని వాపోతున్నారు. కాగా అమలాపురం డివిజన్ వీఆర్వోలు వీడియోలు, ఫొటోలు చూసిన వెంటనే ఓ ఒక్కరినీ గుర్తించలేదని తెలిసింది. వీడియోలు, ఫొటోల్లో స్పష్టత లేకపోవటం వల్లే గుర్తించలేపోతున్నామని కొందరు వీఆర్వోలు అంటున్నారు. ఇదిలా ఉంటే అమలాపురం పోలీసులు తుని ఘటనలో సెల్ఫీలు, సెల్‌ఫోన్లలో వీడియో తీసిన వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వాటిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.