![అమ్మా, నాన్నకు ఏం చెప్పాలి! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71462379722_625x300.jpg.webp?itok=R7s3xjE4)
అమ్మా, నాన్నకు ఏం చెప్పాలి!
సైకిల్‌ను ఢీకొనడంతో
మేనమామ, మేనల్లుడి దుర్మరణం
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మరో బాలుడు
పి.గన్నవరం : మేనల్లుళ్లు చెబుతున్న చిలిపి మాటలను ఆలకిస్తూ.. ఆనందంగా సైకిల్ నడుపుతున్నాడు మేనమామ. వారి వెనుకే మృత్యు రూపంలో దూసుకొచ్చిన లారీ.. ఆ మేనమామ, మేనల్లుడి శరీరాలను ఛిద్రం చేసి, వారు శాశ్వతంగా ముగబోయేలా చేసింది. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని, కళ్లెదుటే ఈ భయానక దృశ్యాన్ని చూసిన మరో బాలుడి నోటమాట రాలేదు.
రాజవరం-పొదలాడ(ఆర్పీ) రోడ్డులో పి.గన్నవరం మండలం చాకలిపాలెం సెంటర్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి సహా ఇద్దరు మరణించారు. మరో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సైకిల్‌పై వెళుతున్న ముగ్గురిని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనలో మేనమామ, మేనల్లుడు చనిపోయారు. ఎస్సై పి.వీరబాబు కథనం ప్రకారం.. నాగుల్లంక గ్రామానికి చెందిన ముమ్మిడివరపు శ్రీను, విజయలక్ష్మికి ఓ పాప, చింటూ(6), సన్నీ ఉన్నారు. భార్యాభర్తలు గల్ఫ్ వెళ్లడంతో.. ముగ్గురు చిన్నారులు తాతయ్య ముమ్మిడివరపు గాంధీ వద్ద ఉంటున్నారు. చింటూ ఒకటో తరగతి చదువుతున్నాడు.
వేసవి సెలవులు కావడంతో ముగ్గురు పిల్లలు వాడ్రేవుపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. మేనమామ ఉండ్రాజవరపు సత్యనారాయణ(45), తన మేనల్లుళ్లు చింటూ(6), సన్నీకి హెయిర్ కటింగ్ చేయించేందుకు సైకిల్‌పై చాకలిపాలెం సెంటర్‌లోని సెలూన్ షాపునకు తీసుకువెళుతున్నాడు. కూల్‌డ్రింక్ సీసాల లోడుతో పొదలాడ వెళుతున్న లారీ వెనుక నుంచి సైకిల్‌ను ఢీకొంది. లారీ చక్రాల కింద పడి సత్యనారాయణ, చింటూ అక్కడిక్కడే మరణించారు. స్వల్పగాయాలతో సన్నీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మృతుడు సత్యనారాయణ స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఉండ్రాజవరపు సూర్యప్రకాశరావుకు సోదరుడు. సంఘటన స్థలాన్ని రావులపాలెం సీఐ పీవీ రమణ పరిశీలించారు. ఎస్సై వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మా, నాన్నకు ఏం చెప్పాలి!
ఈ సంఘటనలో కుమారుడు సత్యనారాయణ, మనవడు చింటూ మరణించడంతో సత్యనారాయణ తల్లి మంగమ్మ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సత్యనారాయణ భార్య ధనలక్ష్మి, చింటూ తల్లిదండ్రులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. ‘మీ అమ్మా, నాన్నకు ఏం చెప్పాలిరా చింటూ.. అంటూ మంగమ్మ బోరుమంది. కుమారుడి మరణంతో ఆమె దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఈ సంఘటనతో నాగుల్లంక, వాడ్రేవుపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
రాస్తారోకో
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, చాకలిపాలెం సెంటర్‌లో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆందోళన కారులతో మాట్లాడారు. పొదలాడ, చాకలిపాలెం, నాగుల్లంక సెంటర్లలో ఆక్రమణలను రెండు రోజుల్లో తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, లేకపోతే తానే ఆందోళన చేపడతానని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు.