నిర్లక్ష్యానికి ఇద్దరు మృతి
నిర్లక్ష్యానికి ఇద్దరు మృతి
Published Thu, Jan 5 2017 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
- రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ డ్రైవర్
- ఢీకొన్న ఆర్టీసీ బస్సు
- ఇద్దరు డ్రైవర్లు మృతి
- నలుగురికి గాయాలు
డోన్ టౌన్: లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. కర్నూలు - బెంగళూరు రహదారిపై డోన్ పరిధిలోని ఓబులాపురం మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాత పడ్డారు. నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి 14 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వస్తుండగా, బేతంచెర్ల నుంచి ఓబులాపురానికి ప్రొక్లెయిన్‌ను తీసుకెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓబులాపురం గ్రామానికి వెళ్లేందుకు పక్కనే సర్వీసు రోడ్డు కూడా ఉంది. అయితే లారీ డ్రైవర్ దూరమవుతుందని భావించి హైవేలోనే రాంగ్ రూట్‌లో వెళ్లడం, రాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న బస్సు డ్రైవర్ గమనించక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కర్నూలు వైపు వస్తున్న వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం డోన్ ఎస్‌ఐ శ్రీనివాసులు, రూరల్ ఏఎస్‌ఐలు ఇస్మాయిల్, బాషా, పోలీసులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పొక్లెయిన్ సహాయంతో లారీ, బస్సును పక్కకు తీశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బనగానపల్లె మండలం రామకృష్ణాపురానికి చెందిన లారీ డ్రైవర్ శ్రీరాముడు(21) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సికింద్రాబాద్‌కు చెందిన బస్సు డ్రైవర్ అంజయ్య ఆచారి (41), ప్రయాణికులు ఏఎన్‌రావు, జాకీర్, హుశేన్, మహమ్మద్ అన్వర్, లారీ క్లీనర్ పరమేశ్‌ను కర్నూలుకు తరలించారు. బస్సు డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement