మండలంలోని గొట్లూరు గ్రామం వంక వద్ద శుక్రవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.
- ఇద్దరి దుర్మరణం
- మరొకరికి గాయాలు
ధర్మవరం అర్బన్ : మండలంలోని గొట్లూరు గ్రామం వంక వద్ద శుక్రవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని కేపీటీ వీధికి చెందిన గజ్జెల బాలగంగాధర్(27), శివానగర్‌కు చెందిన పన్నూరు నారాయణరెడ్డి(28), దిగువగేరికి చెందిన వి.రవికుమార్ మద్యం సేవించి అర్థర్రాతి ద్విచక్రవాహనంలో బయల్దేరారు.
గొట్లూరు వంక వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి ఢీకొట్టి కింద పడిపోయారు. ట్రాక్టర్ వాళ్లు ఇది గమనించకుండా వెళ్లిపోయారు. దాదాపు గంట తర్వాత అటువైపు వస్తున్న వాహనదారులు గమనించేసరికి బాలగంగాధర్, నారాయణరెడ్డి మృతి చెందారు. తీవ్రంగా గాయపడి ఉన్న రవికుమార్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.