రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
డి.హీరేహాళ్ (రాయదుర్గం), తాడిపత్రి రూరల్ : కుటుంబాలను పోషించే ఓ యువతి, ఓ యువకుడిని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం మిగిల్చింది. శుక్రవారం జరిగిన ఈ రెండు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురడి నుంచి పలువురు కూలీలు శుక్రవారం బొమ్మనహాళ్ మండలం శ్రీరంగాపురం వద్ద పొలాల్లో కలుపుతీసే పనికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా ఎస్.ఆర్.కోట సమీపంలో మలుపువద్దకు రాగానే ఆటోలో కూర్చున్న కూలీ శాంతమ్మ (19) తను పట్టుకున్న ఇనుప కడ్డీ ఊడిరావడంతో కిందపడింది. ఆ వెంటనే వెనుకచక్రం ఆమె తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మురడి గ్రామానికి చెందిన రుద్రప్ప భార్య గంగమ్మ ఇదివరకే మృతి చెందడంతో కుమార్తె శాంతమ్మే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేది. ఇప్పుడు ఆమె కూడా మృత్యువాత పడటంతో తండ్రి, తమ్ముళ్లు గుండెలవిసేలా రోదించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.
తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన వీణయ్య, జయమ్మ దంపతుల రెండో కుమారుడు కుమార్ (21) తాడిపత్రిలో ఓ అడిటర్ వద్ద పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా హైదారాబాద్‌కు వెళ్లి తిరిగి వచ్చిన కుమార్ శుక్రవారం తాడిపత్రి నుంచి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గం మధ్యలోని అక్కన్నపల్లి పెట్రోల్ బంక్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.