- ఐదుగురికి తీవ్ర గాయాలు
- ఇద్దరి పరిస్థితి విషమం
- కన్నీరు మున్నీరైన మృతుల బంధువులు
- జనగామ – మద్దూరు రహదారిపై గానుగుపహాడ్ స్టేజీ వద్ద ఘటన
ఆటో బోల్తాపడి ఇద్దరి దుర్మరణం
Published Wed, Aug 24 2016 12:23 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
జనగామ రూరల్ : ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని జనగామ–మద్దూరు రహదారిపై గానుగుపహాడ్ గ్రామం వద్ద మంగళవారం జరిగింది. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ట్రాలీఆటో నర్మెట మండలం కన్నెబోయినగూడెం వద్ద సామగ్రిని దింపేందుకు వెళ్లింది. తిరుగుప్రయాణంలో డ్రైవర్ జనగామ వైపు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారిలో నర్మెట మండలం కన్నెబోయినగూడెంకు చెందిన ధారవత్ టీక్యా(50), ఆల కుంట్ల ఎల్లమ్మ, ఇదే గ్రామశివారు ఇప్పలగడ్డ తండాకు చెందిన బానోతు తారమ్మ, నర్మెటకు చెందిన శివరాత్రి కనకలక్ష్మి(32), ఆమె కూతురు శివరాత్రి శిరీష, బంధువు సంధ్య(అంక్షాపూర్), జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి ఎల్లయ్య ఉన్నారు. ఆటో గానుగుపహాడ్ స్టేజీ(జెండాబోడు గడ్డ) దాటాక మూలమలుపు వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరికి తీవ్ర గాయాలు కావడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శివరాత్రి కనకలక్ష్మి, ధారవత్ టీక్యా మృతిచెందారు. ఎల్లమ్మ, శిరీష, సంధ్య, తారమ్మ, ఎల్లయ్యల తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో తారమ్మ, ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్‌కు తరలించారు. ఇద్దరి మృతితో వారి బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. మృతులు టీక్యాకు భార్య విజయ, కుమార్తె మంజుల, కుమారుడు గోపాలకృష్ణ ఉండగా, కనకలక్ష్మికి భర్త కనకయ్య, కుమార్తె శిరీష(క్షతగాత్రురాలు), కుమారుడు రవి ఉన్నారు.
Advertisement