♦ దైవ దర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
♦ మరొకరి పరిస్థితి విషమం పదిహేను మందికి గాయాలు
♦ అందరిదీ ఒకే కుటుంబం.. న్యూ హుమ్నాపూర్ వద్ద దుర్ఘటన
♦ ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ ఇద్దరు మహిళల మృతి
పుల్‌కల్: దైవ దర్శనానికి వెళుతున్న భక్తులకు ఓ లారీ మృత్యు రూపంలో ప్రాణాలు హరించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పుల్‌కల్ మండలం న్యూ హూమ్నపూర్ వద్ద జరిగిన ప్రమాదానికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ గొల్లగూడెం తండాకు చెందిన కిమ్యా తోపాటు ఆయన బంధువులు కుమార్, చందర్, మాన్‌సింగ్, శ్రీను మరి కొందరు ఏడపాయల దుర్గామాత జాతరకు మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌లో బయల్దేరారు. హూమ్నపూరం వద్ద ముందు వెళుతున్న ఓవర్ టేక్ చేయబోగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కిమ్యా భార్య కేలి (45), భూలీ బాయి(42) అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మవారి కోసం తీసుకెళుతున్న మేక కూడా చనిపోయింది. మరో 13 మందికి గాయలు కావడంతో 108లో సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్‌ఆర్ అసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.ట్రాక్టర్‌ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఆలయానికి వెళుతున్న వారి సామగ్రి చెల్లాచెదరుగా పడ్డాయి.
ఒకరి పరిస్థితి విషమం
సంగారెడ్డి రూరల్: పుల్‌కల్ మండలం హూమ్నపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మందిని సంగారెడ్డి మండలం ఎంఎన్‌ఆర్ ఆసుపత్రి తరలించారు. వారిలో చెంద్రి బాయి తలకు బలమైన గాయాలు తగలడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కిమ్యా నడుము విరగగామాలీ బాయికి చేయి విరిగింది. అనీత, సంగీత,బుజ్జి, రవీందర్, వాల్యా, శివకు గాయాలయ్యాయి. చిన్నారులు చంద్ర కిషోర్ కుడికాలు విరిగింది. హారిక, కిశోర్, సాత్వీక్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు మృతి చెందడంతో వారి గ్రామం గొల్లాగుడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ అంత విషాదంగా కనిపించింది.