కలెక్టర్ బదిలీ అయ్యేంత వరకు ఉద్యమం
– బీసీ సంఘాల హెచ్చరిక
కర్నూలు(అర్బన్): అధికార దర్పంతో జిల్లాలో నియంతగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను జిల్లా నుంచి బదిలీ చేసేంత వరకు దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. జిల్లాలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా, కలెక్టర్ తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లక్ష్మినరసింహ, ఉపాధ్యక్షుడు టీ. శేషఫణి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్‌ను కలవాలని బంగ్లా వద్ద వేచివున్నా, పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆయన నిరంకుశ వైఖరిని ఎత్తి చూపుతున్నదని వారు నినదించారు. ప్రజల బాధలను పట్టించుకోని కలెక్టర్ తమకు వద్దన్నారు. ఆయన విధుల్లోకి చేరినప్పటి నుంచి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులను వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ నెల 14న కలెక్టరేట్‌లో రెవెన్యూశాఖకు చెందిన ఓ ఉద్యోగి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసి కోరతామన్నారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ నాయకులు దేవపూజ ధనంజయాచారి, సింధు నాగేశ్వరరావు, జలం శ్రీను, బహుజన సేవా సంఘం అధ్యక్షుడు సుబ్బరాయుడు, విజయ్‌కుమార్, మారెప్పయాదవ్, కృష్ణమూర్తి యాదవ్, బాలసంజన్న, దండు శేషుయాదవ్, మద్దిలేటియాదవ్ తదితరులు పాల్గొన్నారు.