ఉపాధికీ బదిలీ
-
పీఎంజీవైలో కూలీలకు బ్యాంక్ ఖాతాలు
-
సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అమలు
-
తొలివిడతగా 29 మండలాల్లో అమలవుతున్న వైనం
జిల్లావ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు నగదు బదిలీని అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగదు బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) చర్యలు చేపట్టింది. కూలీలందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు తెరిపించి, ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయనుంది.
– కాకినాడ సిటీ
దశలవారీగా జిల్లాలోని 62 గ్రామీణ మండలాల్లో నగదు బదిలీని సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో డ్వామా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కూలీల బ్యాంకు ఖాతాల ప్రక్రియ పూర్తయితే, అన్నిచోట్లా మైక్రో ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నగదు బదిలీకి నోడల్ బ్యాంక్‌గా ఆంధ్రాబ్యాంక్ వ్యవహరిస్తోంది. నోడల్ బ్యాంక్ నుంచి ఎప్పటికప్పుడు ఉపాది కూలీల సొమ్ము నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది. వారం రోజులకు ఓసారి ఖాతాకు జమయ్యే కూలీ సొమ్ము తీసుకోకపోయినా, వారి ఖాతాలో నిల్వ ఉన్నందున ఆ మొత్తానికి వడ్డీ కూడా వస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఆధార్ అనుసంధానంతో..
ఉపాధి హామీ పథకం ప్రారంభంలో కూలీల నుంచి వేలిముద్రలు, సంతకాలు తీసుకుని, తపాలా సిబ్బంది నగదును పంపిణీ చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరగడంతో, ప్రభుత్వం స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టి.. బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయినా కూలీలకు సకాలంలో డబ్బు అందకపోవడం, ఇతర కారణాలతో చెల్లింపుల్లో మార్పులు తీసుకువచ్చి, ఆధార్ ఎనైబుల్ పేమెంట్ సిస్టం (ఆధార్ అనుసంధానం) ద్వారా పంపిణీ చేస్తున్నారు.
జాబ్ కార్డులున్న వారందరికీ..
ఇప్పుడు అన్ని సబ్సిడీ పథకాను ఒక గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా కేంద్రం ఉపాధి హామీ పథకానికి ప్రత్యక్ష నగదు బదిలీకి శ్రీకారం చుట్టింది. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పీఎంజేడీవై లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంకులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
దీంతో కూలీల ఖాతాల అనుసంధాన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. జిల్లాలోని 62 గ్రామీణ మండలాల్లో 1,075 పంచాయతీల్లో సుమారు 7 లక్షల మందికి ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులున్నాయి. వీరిలో 4.80 లక్షల మంది జాబ్ కార్డులను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేశారు.
117 పంచాయతీల్లో అమలు
జిల్లాలో తొలి విడతగా 29 మండలాల్లోని 117 పంచాయతీల్లో 22,544 మంది కూలీలకు నగదు బదిలీ ప్రక్రియ అమలు జరుగుతోంది. త్వరలోనే రెండో విడతగా 41 పంచాయతీల్లోని 53,342 మంది కూలీలకు ఈ ప్రక్రియ అమలు చేయనున్నాం.
– ఎ.నాగేశ్వరరావు, పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)