వరంగల్కు మరో అరుదైన గుర్తింపు
► నగరంలో 23 సెంటర్ల ఏర్పాటు
► విద్యా కేంద్రం వరంగల్‌కు అరుదైన గుర్తింపు
వరంగల్ : విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను తొలిసారిగా వరంగల్లో నిర్వహించారు. సివిల్స్ పరీక్షకు 10, 858 మంది అప్లై చేసుకోగా 4264 మంది ఉదయం పేపర్ -1 పరీక్షకు హాజరయ్యారు. 6594 మంది గైర్హాజయ్యారు.
ఉదయం హాజరు శాతం 39.27 ఉండగా మధ్యాహ్నం 38.83 శాతానికి పడిపోయింది. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 4216 మంది హాజరుకాగా, 6642 మంది గైర్హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్ష జరిగింది. వరంగల్ జిల్లాలో పరీక్ష నిర్వహణకు 23 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులకు ఉపయోగపడేలా ఈ ఏడాది వరంగల్ లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.