ఈఎస్‌ఐసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
విజయవాడ (లబ్బీపేట) :
కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) కార్మికుల సంక్షేమానికి అనేక ప్రయోజనాలు కల్పిస్తుందని ఈఎస్‌ఐసీ(న్యూఢిల్లీ) ఫైనాన్షియల్ కమిషనర్ యు.వెంకటేశ్వర్లు చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ పిలుపు మేరకు ఈఎస్‌ఐసీ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం విశ్వకర్మ దినోత్సవం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ తాజ్ గేట్‌వేలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈఎస్‌ఐసీకి పది మెడికల్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో 253 సీట్లు ఉండగా, అవి భర్తీ కావడమే కష్టమవుతోందన్నారు. అందుకు కార్మికుల్లో అవగాహనా లోపమే కారణమన్నారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌గా విభజించి గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు చేపడుతోందన్నారు. ఈ చట్టాలతో కార్మిక, ఉద్యోగులకు సామాజిక భద్రత, వైద్య ఆరోగ్య సహకారం లభిస్తుందన్నారు. విజయవాడలో త్వరలో స్టోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈఎస్‌ఐసీ రీజినల్ డైరెక్టర్ పీఆర్ దాస్, రీజినల్ పీఎఫ్ కమిషనర్ పి.వీరభద్రస్వామి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హెచ్.రామానుజం పాల్గొన్నారు.