పనికి రాని టైర్లతో కోట్ల వ్యాపారం
-
మహిళా వ్యాపారవేత్త స్వర్ణలత విజయం
-
సీఎం చేతులమీదుగా పురస్కారం
ఏయూ క్యాంపస్: ‘కలలు కనండి..నిద్రపోయేటప్పుడు కాదు..లక్ష్యం సాధించేవరకూ..అప్పుడే విజయం వరిస్తుంది. ఏ పని చేసినా పట్టుదలతో ఇష్టపడి చేయాలి. అప్పుడే సక్సస్ రుచి చూస్తాం’ అంటున్నారు ఔత్సాహిక పారిశ్రామిక వేత స్వర్ణలత. పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూ తన నీడలో మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యర్థాలే ముడిసరుకుగా అర్థవంతమైన వ్యాపారం చేస్తూ లాభాలబాటలో పయనిస్తున్నారు. మదిలో మెదిలిన ఆలోచనను ఆచరణలో పెట్టి విజయకటాక్షం అందుకున్నారు. కష్ణాపుష్కరాల్లో భాగంగా ఉత్తమ దళిత మహిళా వ్యాపారవేత్త పురస్కారాన్ని సీఎం చేతులమీదుగా స్వర్ణలత అందుకున్నారు.
వ్యాపారం ఏంటంటే...
వాహనాలకు వినియోగించిన రబ్బరు టైర్లను నిరుపయోగంగా వదిలేస్తారు. వీటిని కాల్చివేయడం వలన పర్యావరణం కలుషితం జరుగుతుంది. వీటిని పునర్విణియోగం చేసే దిశగా స్వర్ణలత పరిశ్రమను స్థాపించారు. గంభీరంలోని కేఎస్ ప్రిన్స్‌టన్ రబ్బర్ ఇండస్ట్రీస్ పేరుతో క్రంబ్ రబ్బర్ పరిశ్రమకు 2012లో ప్రారంభించారు. పరిశ్రమ పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించడానికి రెండేళ్ల సమయం పట్టింది. సంవత్సరానికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరుకుంది.
ముడిపదార్థంగా సరఫరా...
పాత పనికి రాని టైర్లను కొనుగోలు చేసి వీటిని మెత్తటి పొడిగా మారుస్తారు. దీనిని హెచ్‌పీసీఎల్‌కు అనుబంధంగా తారు తయారు చేసే పరిశ్రమలో వినియోగిస్తారు. తారులో 20శాతం ఈ రబ్బరు పొడిని వినియోగిస్తారు. విమానాల రన్‌వే, రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అదే విధంగా కేరళలో వివిధ వస్తువులు తయారుచేసే పరిశ్రమలకు ఈ పొడిని వినియోగిస్తారు. కొత్తగా రబ్బరు కొనుగోలు చేసే ధర కంటే క్రంబ్ రబ్బర్(రబ్బరు పొడి) తక్కువగా లభిస్తుండటంతో దీనికి కేరళలో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో మ్యాట్‌లు ఇతర వస్తువులను తయారుచేస్తున్నారు. అదే విధంగా టీవీఎస్ సుందర్ సంస్థకు ఈ పొడిని సరఫరా చేస్తున్నారు. వాల్కనైజేషన్ జరిపి రీ టైరింగ్ చేయడానికి ఈ పొడిని ఉపయోగిస్తున్నారు.
గృహిణి నుంచి పారిశ్రామిక వేత్తగా..
గృహిణిగా ఇద్దరు పిల్లలను తీర్చిదిద్దుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ సెంటర్ సహకారంతో గంభీరంలో పరిశ్రమ స్థాపించారు. దీనికోసం ఎస్‌బీఐ నుంచి కోటి రూపాయలు రుణం తీసుకున్నారు. ప్రస్తుతం 20 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అదే విధంగా వీరు నివాసం ఉండటానికి వసతిని సైతం కల్పిస్తున్నారు. భర్త కరుణ కుమార్ శ్రీకాకుళంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఏయూలో న్యాయవిద్యను పూర్తిచేసిన స్వర్ణలత భర్త పోత్సాహంతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.
సొంతంగానే మార్కెటింగ్
పరిశ్రమ ప్రారంభించిన కొత్తలో ఏడాదిన్నర కాలం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సొంతంగా మార్కెటింగ్‌ను సష్టించుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పరిశ్రమలకు వివరించడం, ఆన్‌లైన్ టెండర్లు వేసి సరుకు సరఫరా చేయడం వంటి నైపుణ్యాలను సాధించారు. ఇటు ఉత్పత్తి, మరోవైపు మార్కటింగ్‌లను సమర్థవంతంగా నిర్వహించారు.
హుద్‌హుద్‌లో రూ. 20 లక్షలు నష్టం
హుద్‌హుద్ సమయంలో సంస్థకు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీనిలో రూ.15 లక్షల వరకు బీమా రూపంలో తిరిగి వచ్చింది. అదే విధంగా ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల వరకు రాయితీలు లభించడంతో పరిశ్రమ నిలదొక్కుకుంది.
రెండో యూనిట్ ప్రారంభిస్తున్నాం
ప్రస్తుతం మా పరిశ్రమలో ఉత్పత్తి చేస్తున్న రబ్బరు పొడిని ఇతర సంస్థలకు సరఫరా చేయడం జరుగుతుంది. దీనిని నిర్వహిస్తూ క్రంబ్ రబ్బర్‌తో మేట్స్, ఇండస్ట్రియల్‌మేట్స్ వంటివి తయారు చేసే పరిశ్రమను ప్రారంభిస్తున్నాం. పరిశ్రమలకు ముడి సరుకును అందిస్తూ, వస్తు ఉత్పత్తి చేసే దిశగా పనిచేస్తాం.
–స్వర్ణలత, పారిశ్రామిక వేత్త