‘ఉట్నూర్’ జిల్లా చేయాల్సిందే..
-
19న ఏజెన్సీ బంద్‌కు పిలుపు
-
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
ఉట్నూర్‌రూరల్ : ఉట్నూర్‌ను జిల్లాగా ప్రకటించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉట్నూర్ జిల్లా సాధన కమిటీ కన్వీనర్ సిడాం శంభు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం జిల్లాలను ప్రకటించడం సరికాదన్నారు. ఉట్నూర్ జిల్లా ఏర్పాటు చేయకపోతే ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు ఇతర జిల్లాల్లో కలవడంతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వంతో తమ సంఘం ఆధ్వర్యంలో చర్చించి జిల్లాపై ప్రతిపాదనలు అందించామన్నారు. ఉట్నూర్, ములు, భద్రాచలంను ఆదివాసీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సాధన ఉద్యమంలో గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం పాల్గొనాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 19న ఏజెన్సీ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, నాయకులు వెడ్మ భొజ్జు, గణపతి, రామారావు, రాందాస్, శ్రీనివాస్, నారాయణ, రాజేందర్, శంకర్, సర్దార్, జేపీ నాయక్, గణేశ్ భిక్కు, జుగాదిరావు , ఆర్.గణేశ్ పాల్గొన్నారు.