కమీషన్ల కక్కుర్తికే కాంట్రాక్టర్లకు కోట్లు | Uttam kumar reddy fired on CM KCR and government | Sakshi
Sakshi News home page

కమీషన్ల కక్కుర్తికే కాంట్రాక్టర్లకు కోట్లు

Published Fri, Oct 21 2016 2:40 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కమీషన్ల కక్కుర్తికే కాంట్రాక్టర్లకు కోట్లు - Sakshi

కమీషన్ల కక్కుర్తికే కాంట్రాక్టర్లకు కోట్లు

మహబూబాబాద్ రైతు గర్జన సభలో ప్రభుత్వంపై ఉత్తమ్ ఫైర్
రైతు రుణమాఫీకి సీఎంకు మనసొప్పట్లేదని ధ్వజం
40 లక్షల మంది రైతులతో సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం

సాక్షి, మహబూబాబాద్: ‘‘రైతు రుణమాఫీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్, మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ చెల్లింపునకు ప్రభుత్వం వద్ద డబ్బులుండవు. కానీ రాష్ట్ర ప్రజలందరినీ తాకట్టుపెట్టి రూ.వేల కోట్లు అప్పు తెచ్చి కమీషన్ల కక్కుర్తి కోసం కాంట్రాక్టర్లకు ఇస్తున్నది వాస్తవం కాదా’’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్లు చెల్లిస్తున్న సీఎం కేసీఆర్‌కు... రైతు రుణమాఫీ చేసేందుకు మనసెందుకు ఒప్పదన్నా రు.

రాష్ట్ర బడ్జెట్ రూ.1.3 లక్షల కోట్లు ఉంటే ఇందులో రైతు రుణమాఫీకి రూ. 2వేల కోట్లు లేవా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో రాష్ట్రానికి రూ.65 వేల కోట్లు అప్పు ఉంటే కేసీఆర్ సర్కారు రెండున్నరేళ్లలోనే రూ.65 వేల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు గర్జన సభలో ప్రసంగించిన ఉత్తమ్.. కేసీఆర్ తన విలాసాలు, అవినీతి, వ్యక్తిగత సంపాదన కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, బంగారు తెలంగాణ పేరుతో ప్రజల్ని మాయ మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. తన నివాసం కోసం రూ. 30 కోట్లు, వాహనాల కోసం రూ. 50 కోట్లు, సెక్రటేరియట్ కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు.

వ్యవసాయ సంక్షోభం...
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులతోపాటు వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఉత్తమ్ విమర్శించారు. నకిలీ విత్తనాలు, మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ఉద్యమించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైందన్నారు. మొత్తంగా 40 లక్షల మంది రైతు కుటుంబాలకు ఏక కాలంలో రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ప్రతి జిల్లాలో రైతు గర్జన పేరిట సభలు నిర్వహిస్తున్నామన్నారు. 40 లక్షల మంది రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాలను నెల రోజుల్లో మహోద్యమంగా పూర్తి చేస్తామన్నారు.

కేసీఆర్ మెడలు వంచైనా రైతులను రుణ విముక్తులను చేసేందుకు పోరాడతామన్నారు. డిసెంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారని, ఈ సభలో సంతకాల పత్రాలన్నింటినీ ఆయనకు సమర్పించి... రాహుల్ ద్వారా వాటిని రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రైతు గర్జన సభతో మానుకోట నుంచే శ్రీకారం చుడుతున్నామంటూ సంతకాల సేకరణ పత్రాన్ని ఆవిష్కరించారు.

‘ఫీజు’ లేక విద్యార్థుల ఇబ్బందులు...
ఫీజు రీరుుంబర్స్‌మెంట్ లేకపోవడంతో రాష్ట్రంలో 3,200 కాలేజీలు కోర్సులను ఎత్తివేసే పరిస్థితి నెలకొందని ఉత్తమ్ చెప్పారు. అలాగే 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని, 2.5 లక్షల మంది లెక్చరర్లకు 4, 5 నెలలుగా వేతనాలు లేవన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకున్నామని, కానీ గతేడాది రైతులు పంట నష్టపోతే  కేంద్రం రూ.790 కోట్లు విడుదల చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఆ సొమ్మును కాంట్రాక్టర్లకు మళ్లించిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదలు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రతి 500జనాభాగల గిరిజనుల తండాలను పంచాయతీలుగా చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందన్నారు.

టీఆర్‌ఎస్ రక్తంలో మోసం, ద్రోహం: జైపాల్‌రెడ్డి
యూపీఏ ప్రభుత్వ హయాంలో రుణమాఫీగా రాష్ట్రానికి రూ. 12వేల కోట్లు ఇస్తే అప్పటి సీఎం వైఎస్సార్ అదనంగా రూ.5 వేల కోట్లు ఇచ్చి రైతులకు రుణమాఫీ చేశారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ కేసీఆర్ ప్రస్తుతం చేసే రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోదన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ రక్తంలో ద్రోహం, మోసం ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పరాజయం తప్పదన్నారు.

కాంగ్రెస్ శాసనసభ పక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ అధికార దర్పంతో ఉన్న టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు కదిలి రావాలన్నారు. జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్  కొప్పుల రాజు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, రేగా కాంతారావు, నేతలు మల్లు రవి, కోదండరెడ్డి, అనిల్ యాదవ్, కత్తి వెంకటస్వామి, విజయ రామారావు, రవీంద్ర నాయక్, ఎరబ్రెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement