నాణ్యతకు తూట్లు
రూ.6 కోట్ల రోడ్ల పనుల్లో అవకతవకలు
అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు
ఆత్రేయపురం (కొత్తపేట) : వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారులను రూ.ఆరు కోట్లతో నిర్మిస్తుండగా తెలుగుదేశం నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. లొల్ల నుంచి వాడపల్లి ఆలయానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఊబలంక నుంచి ర్యాలి వరకు రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరు కాగా ఇటీవల పనులు ప్రారంభించారు. అందుకుగాను వాడపల్లి గొడ్డుకాలువ వంతెన నుంచి ఏటిగట్టు వరకు 10 మీటర్లు, లొల్ల వంతెన నుంచి గొడ్డుకాలువ వంతెన వరకు 7 మీటర్ల రోడ్డు నిర్మించాలి. కానీ లొల్ల చెరువు గట్టు సమీపంలో, పంచాయతీ సమీపంలో టర్నింగ్ వద్ద 3 మీటర్ల వెడల్పున నిర్మిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడులతో రోడ్డు అలైన్‌మెంట్ పనులు ఇష్టానుసారంగా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన తెలుగుదేశం నేతలు సర్వే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆక్రమణలు తొలగింపులో అవకతవకలకు పాల్పడుతుండటంతో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు అష్టవంకర్లతో నిర్మితమయ్యేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పనులు నాసిరకం సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో సిమెంట్ రోడ్డు బీటలు వారే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తునారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ మణికుమార్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల అదేశాల మేరకు అవసరం మేరకే ఆక్రమణలు తొలగించి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.