వజ్ర వంకర్లు! | vajra vankarlu | Sakshi
Sakshi News home page

వజ్ర వంకర్లు!

Published Thu, Jul 13 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

vajra vankarlu

వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో చీకటి కోణం
- ఎస్సీ, ఎస్టీలకు రుణాల పేరిట టోకరా
- రూ.అరకోటి నిధులతో ఇష్టారాజ్యం
- రూ.10లక్షలకు రికార్డులే కరువు
- క్షేత్ర స్థాయిలో కనిపించని యూనిట్లు
- సభ్యులకు తెలియకుండా నేతల నాటకం


అనంతపురం టౌన్‌ : ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల పెంపు లక్ష్యంగా సమగ్ర వాటర్‌షెడ్‌ యాజమాన్య కార్యక్రమాలు చేపట్టాలి. ఆస్తులు లేని వ్యక్తుల జీవనోపాధికి ప్రత్యేకంగా వాటర్‌షెడ్‌కు కేటాయించిన నిధుల్లోంచి 9 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వజ్రకరూరు వాటర్‌షెడ్‌ పరిధిలోని గ్రామాల్లో రుణాల మంజూరు, యూనిట్ల ఏర్పాటులో అధికార పార్టీ నేతలు, వాటర్‌షెడ్‌ అధికారులు మాయాలోకాన్ని సృష్టించారు. లైవ్లీ హుడ్‌(ఎల్‌హెచ్‌)కు రూ.49.33 లక్షలు కేటాయించగా ఈ మొత్తం ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నా.. యూనిట్ల ఏర్పాటులో మతలబు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కడికక్కడ బినామీ పేర్లతో నిధులు బొక్కేశారు. రూ.10 లక్షల ఖర్చుకు కనీస రికార్డులు కూడా లేని దుస్థితి.

బోడిసానిపల్లి పరిధిలో 28 మందికి గొర్రెలు, మేకలు, ఎనుములు, ఎద్దుల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలను మహిళా సంఘాల్లోని సభ్యులకు ఇచ్చినట్లు చూపించారు. ఇక్కడ తులసీభవాని సంఘానికి చెందిన కమలమ్మకు వ్యవసాయ అవసరాల కోసం రూ.15 వేలు మంజూరు చేసినట్లు చూపి తీసిన ఫొటోనే మరో గ్రామంలోని లబ్ధిదారుల జాబితాలో ఉంచారు. యూనిట్లతో కలిసి తీసిన ఒకే ఫొటోను ఆరేడుగురు పేర్లతో రుణం మంజూరు చేసినట్లు అప్‌లోడ్‌ చేశారు. తట్రకల్లు పరిధిలో 61 మంది బోర్‌వెల్, దుస్తుల దుకాణం, గొర్రెలు, ఎనుముల కోసం మంజూరు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఆంజనేయస్వామి, ఇందిర, చరిత, ఝాన్సీ, మదర్‌థెరిస్సా, ప్రియాంక, స్వర్ణ, విజయ తదితర సంఘాల్లోని సభ్యులకు రుణం ఇచ్చినట్లు చూపుతున్నా.. చాలా వరకు అవి అందని పరిస్థితి.

గంజికుంట పరిధిలో 57 మందికి రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొనగా.. అంజినమ్మ పేరుతోనే నాలుగైదు రుణాలు ఉన్నాయి. 620844667487 ఆధార్‌ నంబర్‌ అంజినమ్మదిగా పేర్కొంటూ.. అదే ఆధార్‌ నంబర్‌పై మంగమ్మ అనే మహిళకు రుణం మంజూరు చేసినట్లు చూపి నిధులు మింగేశారు. నల్లబోతుల అనే మహిళ పేరుతో నాలుగు లోన్లు ఇచ్చి ఒకచోట శాంతి సంఘం, మరోచోట ఇందిరా సంఘానికి చెందిన మహిళగా పేర్కొన్నారు. ఎన్‌ఎన్‌పీ తండాలో తొమ్మిది మందికి ఇవ్వగా ఇక్కడా అదే పరిస్థితి. ఇక్కడికి కేటాయించిన నిధులను తట్రకల్లులోని సభ్యులకు ఇచ్చినట్లు చూపి నిధులు భోంచేశారు. రాగులపాడులో 12 మందికి మంజూరు చేశామనే లెక్కల్లో చాలా వరకు కూడా బోగస్‌వే. వజ్రకరూరులో 42 మందికి రుణాలిచ్చినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆశాజ్యోతి సంఘంలోని ఎన్‌.జ్యోతికి రూ.25 వేలను వ్యవసాయ పనుల కోసం మంజూరు చేశామని పేర్కొంటూ తీసిన ఫొటోనే అదే సంఘంలోని శాంతమ్మకు రూ.25 వేలు మంజూరు చేసినట్లు చూపారు.

శాంతి సంఘానికి చెందిన మద్దికెరికి గొర్రెల కోసం రూ.14 వేలు రుణం.. లక్ష్మిసువర్ణ సంఘానికి చెందిన విమలమ్మకు ఆటో, జీపు, ట్రాలీ రిపేరి షాప్‌ కోసం రూ.25 వేలు రుణం ఇచ్చినట్లు చెప్పినా ఫొటో మాత్రం గొర్రెలది చూపడం గమనార్హం. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తవ్విన కొద్దీ అక్రమాల బాగోతం వెలుగు చూస్తోంది. రుణం మంజూరు చేసినట్లు అధికారులు చూపుతున్న జాబితాలోని కొందరికి ‘సాక్షి’ ఫోన్‌ చేయగా అసలు తమకెలాంటి రుణాలు అందలేదని పేర్కొన్నారు.
 
నా కోడలు పేరుతో రుణం ఇచ్చారంట
మూడేళ్లుగా నా కొడుకు ఆదినారాయణ, కోడలు లక్ష్మిలు బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల సామాజిక తనిఖీ బృందం అధికారులు వచ్చి నా కోడలు పేరు మీద రుణం మంజూరైందని చెప్పారు. అప్పటి వరకు నాకా విషయమే తెలీదు. ఇదే విషయాన్ని వారికి రాసిచ్చాను.
– మస్తానమ్మ, తట్రకల్లు

నా పేరు మీద మంజూరైందట
మొన్నామధ్య అధికారులు వచ్చి నా పేరుతో రుణం మంజూరైంది కదా అని అడిగారు. ఒక్కసారిగా షాక్‌ అయ్యా. నాకు తెలియకుండా ఎలా మంజూరు చేశారో అర్థం కాలేదు. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలీదు. నా ప్రమేయం లేకుండా ఎలా మంజూరు చేశారో.
– శాంతమ్మ, తట్రకల్లు

రికార్డుల్లో ఉందంట
సామాజిక తనిఖీ జరిగే సమయంలో నా పేరుతో రుణం మంజూరైందని అధికారులు చెప్పగానే ఆశ్చర్యపోయాను. రికార్డుల్లో ఉందని వాళ్లు చెప్పారు. నేనెలాంటి రుణం తీసుకోలేదు.. ఎవరూ ఇవ్వలేదని చెప్పా.
– శాంతి, తట్రకల్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement