అలల కల్లోలం
అలల కల్లోలం
Published Mon, Dec 12 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
జిల్లాకు తప్పిన తుపాను ముప్పు
డెల్టాసహా పలుచోట్ల ఈదురు గాలులు, జల్లులు
కొనసాగుతున్న వర్షసూచన
మరో రెండు రోజులు అప్రమత్తం
సముద్రంలో మోటార్ బోటు గల్లంతు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
కోరలు చాచిన తుపాను సోమవారం చెన్నై వద్ద తీరం దాటడంతో జిల్లాకు ముప్పు తప్పింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్ష సూచన కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని యంత్రాంగం అంచనా వేస్తోంది. సోమవారం ఉదయానికి వాతావరణంలో మార్పు రావడంతో రైతులు భయపడ్డారు. గాలులు వీచినప్పటికీ డెల్టా సహా పలుచోట్ల జల్లులు మాత్రమే పడటంతో పెద్దగా ఇబ్బందులు రాలేదు. చలిగాలుల ఎక్కువ కావడంతో ప్రజలు ఇంటినుంచి బయటకు అడుగుపెట్టేందుకు సాహసించలేదు. సముద్రంలో మాత్రం కల్లోల పరిస్థితులు కనిపించాయి. అలలు పెద్దఎత్తున విరుచుకుపడటంతో తీర గ్రామాల ప్రజలు, మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవాని లంక గ్రామాల్లో భారీ కెరటాలు తీరాన్ని తాకాయి. చినమైనవానిలంకలో అలలు పాత తుపాను షెల్టర్‌ను తాకాయి. పెదమైనవానిలంకలో తీరం కోతకు గురైంది. అలల ధాటికి కొబ్బరి, తాడిచెట్లు కొట్టుకుపోయాయి.
బోటు గల్లంతు
తుపాను ప్రభావంతో నరసాపురం మండలం చినమైనవానిలంక వద్ద సముద్రంలో సోమవారం ఉదయం మోటారు బోటు చిక్కుకుంది. కాకినాడ కోస్టుగార్డుకు సమాచారం అందడంతో వారు బోటు ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి వరకూ ఆచూకీ తెలియరాలేదు.
పొలాల్లోనే రైతులు
రైతులు గత మూడురరోజులుగా పొలాల్లోనే ఉండి పంటను ఒబ్బిడిచేసుకునే పనిలో పడ్డారు. ధాన్యాన్ని ఇళ్లకు తరలించే అవకాశం లేకపోవడంతో సోమవారం పొలాల్లోనే బరకాలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. తుపాను ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పెరవలి మండలంలోని గోదావరి తీరగ్రామాల్లో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అరటి తోటలు విరిగిపోయాయి. తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, అన్నవరప్పాడు, బొక్కావారిపాలెం, లంకమాలపల్లి, ముత్యాలవారిపాలెం గ్రామాల్లో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో చాలాచోట్ల ఇప్పటికే మాసూళ్లు పూర్తయ్యాయి. కాగా కొంత మేర ధాన్యం అమ్మకాలు సాగించారు. అక్కడక్కడా చేలలో వరికుప్పలు ఉన్నాయి. దీంతో పాటు, పశుగ్రాసానికి సంబందించి వరిగడ్డిని రైతులు ఒబ్బిడి చేసుకొనే పనిలో పడ్డారు. గ్రామాలలో ధాన్యం బస్తాలు పాడవుతాయని వాటిపై బరకాలు కప్పి ఉంచారు. మెట్ట ప్రాంతమైన గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 16 వేల హెక్టార్లలో రైతులు వరి వేశారు. కోతలు కోయడంతో పంట పనలపై ఉంది. కొన్నిచోట్ల నూర్పిళ్లు చేస్తున్నారు. మరికొందరు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వరికోత యంత్రాలను సైతం పొలాల్లోకి దింపలేదు. తుపాను ప్రభావం లేనప్పటికీ మరో రెండురోజుల పాటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు.
Advertisement