
కేంద్రంలో చక్రం తిప్పేస్తున్నానని...
- రైల్వేజోన్ ఉద్యమంపై వెంకయ్య వెటకారం
- దాని వెనుక మర్మమేమిటి
- పోలవరానికి, రైల్వేజోన్‌కు ఏమైనా సంబంధం ఉందా?
- దాన్ని సాకుగా చూపి జోన్‌ను త్యాగం చేయమనడమేమిటి
- మరోసారి ఉత్తరాంధ్రకు అన్యాయం జరగనుందా
- కేంద్రం లీకుల వెనుక అర్థం అదేనా..???
నాటి కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఘనమైన చారిత్రక ఉనికి.. వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర అనడంలోనే కుట్ర ఉందన్న చరిత్రకారుల వాదనలకు బలం చేకూరేలా నేటి టీడీపీ, బీజేపీ పాలకులు వ్యవహరిస్తున్నారు.
ఇక్కడి ప్రజల ఆశ.. శ్వాసగా మారిన రైల్వేజోన్ డిమాండ్‌ను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారు.
జోన్ విజయవాడకిస్తే ఏంటి.. అది మన రాష్ట్రంలో లేదా? అని ఓ టీడీపీ ఎంపీ లైట్ తీసుకుంటే.. బీజేపీ పెద్దాయన వెంకయ్య ఏకంగా వ్యంగ్య భాషణమే చేశారు.
నాలుగు రోజుల కిందట నగరానికి వచ్చిన ఆయన రైల్వేజోన్ ఉద్యమాన్ని కేవలం పనీపాటా లేనివాళ్లు చేసే రాద్ధాంతంగా కొట్టిపారేశారు. కనీసం విశాఖకు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని మాట మాత్రంగా కూడా చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు.
ఇక సీఎం చంద్రబాబు యథావిధిగా విశాఖకే రైల్వేజోన్ ఇప్పించేందుకు కృషి చేస్తామని పాతపాటే పాడుతున్నా ప్రత్యేక హోదా విషయంలో జరిగిన నాటకీయ పరిణామాలు చూసి ఆయన మాటల విశ్వసనీయతపై ఉద్యమకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైల్వేజోన్ వ్యవహారంపై అసలేం జరుగుతోంది?.. ఈ డిమాండ్‌ను ఎటు తిప్పి ఎటు తీసుకువెళ్లాలని పాల కులు చూస్తున్నారో.. ఈ వారం విశాఖతీరంలో అవలోకిద్దాం..
కేంద్రంలో చక్రం తిప్పేస్తున్నానని, పాతికమంది కేంద్ర మంత్రులను ఇంటికి పిలిపించి మాట్లాడగలనని వెంకయ్య పదే పదే చెప్పుకుంటారు. ఇటీవలి బీజేపీ కార్యకర్తల సమావేశంలోనూ ఈ మాట నొక్కి చెప్పారు. గడ్కరీని ఏమోయ్ అంటే.. ఆయన వెంకయ్యాజీ... అని అంటారని సెలవిచ్చారు. మరి ఇంత పట్టున్న వెంకయ్య రైల్వేజోన్ విశాఖకే వస్తుంది.. ఎక్కడికీ పోదు.. ఆందోళన వద్దు.. అని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నదే అంతపట్టని ప్రశ్న. ఆయనగారి అసహనమే.. రైల్వేజోన్ వేరేచోటకు తరలిపోతోందా అన్న సందేహాలను మరింత పెంచింది. బీజేపీలోని ఓ వర్గం ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్న వాస్తవమేమిటంటే.. రైల్వేజోన్ విజయవాడకు ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందట!
బోడిగుండుకు.. మోకాలికీ ముడివేయడంటే ఇదేనేమో. రైల్వేజోన్‌కు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ముడిపెట్టిందట. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాలకు ముంపు ముప్పు ఉందని ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు రైల్వేజోన్‌ను విశాఖకు ఇవ్వకుండా యథాతధంగా వాల్తేరు డివిజన్‌ను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ జోన్‌లోనే ఉండనిస్తే.. పోలవరం నిర్మాణానికి అడ్డు చెప్పకుండా ఆ రెండు రాష్ట్రాలను ఒప్పిస్తామని కేంద్రం చెబుతోందట.
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామని హామీనిచ్చిన రైల్వేజోన్‌ను విజయవాడ, గుంటూరు మధ్యలో నెలకొల్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందట. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీరు విశాఖ పారిశ్రామిక రంగానికి అవసరం కాబట్టి.. ఆ మేరకు రైల్వేజోన్‌ను త్యాగం చేయాలని విశాఖ నేతలకు కేంద్రం సూచిస్తోందట!.. రాష్ట్రానికి రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు రెండూ రావాలంటే విశాఖ(వాల్తేరు) రైల్వే డివిజన్‌ను ఒడిశాకు వదులుకోక తప్పదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు.
ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర పెద్దలు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని.. అయితే ఇప్పటికిప్పుడు ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. బీజేపీ నేతల్లో ఈ చర్చే ఇప్పుడు జోరుగా నడుస్తోంది. భావేద్వోగ సమస్యలకు, న్యాయపరమైన డిమాండ్లకు ఎక్కడైనా ఇలా ముడిపెడతారా అన్నదే చర్చనీయాంశంగా మారింది.
ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో బంగారు బాతుగుడ్డులాంటి వాల్తేరు డివిజన్‌ను వదులుకునేందుకు ఒడిశా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఆ రాష్ట్రాన్నే సాకుగా చూపి ఇన్నేళ్లుగా దగా చేసిన విశాఖను మరోసారి పోలవరం పేరుతో మోసం చేసేందుకు పాలకులు పెద్ద కుట్రకు తెరలేపారని ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఫ్లాష్ బ్యాక్..
జూన్ 2014.. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యవిజయం సాధించిన ఊపుతో బీజేపీ నేతలు విశాఖలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం చేశారు. ఆ సందర్భంగా వెంకయ్య భావోద్వేగంతో ప్రసంగించారు. ‘నా రాజకీయ జీవితానికి విశాఖలోనే పునాది పడింది. విశాఖను ఎప్పటికీ మరిచిపోలేను. నగరంతో ఎంతో అనుబంధం ఉంది.. ఇక్కడి ప్రజల డిమాండ్ రైల్వేజోన్‌తో సహా సమస్యలన్నీ పరిష్కరిస్తాను’ అని వాగ్దానం చేశారు.
తాజా సీన్..
సెప్టెంబర్ 2016.. అదే వెంకయ్యగారు నాలుగు రోజుల కిందట నగరానికి విచ్చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ‘ఏం తమాషాగా ఉందా.. రైల్వేజోన్‌పై ఉద్యమమేంటి.. పనీపాటా లేని వాళ్లు ఏవో చేసేస్తే సరిపోతుందా.. జోన్ విశాఖకో.. విజయవాడకో..సుబ్బారావుకో.. అప్పారావుకో.. ఎవరికివ్వాలో ఇంకా కేంద్రం ఏమీ ప్రకటించకుండానే ఏమిటీ రాద్ధాంతం’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రైల్వే జోన్ విశాఖకే వస్తుందన్నభరోసా ఎందుకివ్వడం లేదు?
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడైన విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు వైఎస్సార్ జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ వివాదంపై ఇక్కడ పుంఖానుపుంఖాలుగా పత్రికలకు లేఖలు పంపిస్తారు. కానీ తనను పార్లమెంటుకు పంపిన విశాఖ ప్రజల చిరకాల డిమాండ్ రైల్వేజోన్‌పై మాత్రం ఏమీ మాట్లాడరు. కనీసం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికైనా సభావేదిక నుంచి రైల్వేజోన్‌పై బహిరంగంగా విజ్ఞప్తి చేయరు.
అది ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగ సమస్యగా మారిందని ప్రజల సమక్షంలోనే ఆయన దృష్టికి తీసుకువెళ్లరు. రైల్వేజోన్ ఉద్యమం పనీపాటాలేని వాళ్లు చేస్తున్న రాద్ధాంతంగా వెంకయ్య తీసిపారేసిన ప్పుడైనా.. ఇక్కడి ప్రజలది న్యాయమైన డిమాండ్ సార్.. అని చెప్పలేరు. పోనీ బహిరంగంగా కాకున్నా అంతర్గత సంభాషణల్లోనైనా ఆయన దృష్టికి తీసుకువెళ్లగలరా?.. అంటే అనుమానమే. అందుకే హరిబాబు సహా బీజేపీ నేతలు వెంకయ్య వెళ్లిన తర్వాత రైల్వేజోన్‌పై స్పష్టత లేని ప్రకటనలే చేస్తున్నారు.
మావంతు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారే తప్ప జోన్ విశాఖకే వస్తుందని మాత్రం చెప్పే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వేజోన్ ఏమవుతుంది.. కేంద్రం లీకులు ఇస్తున్నట్లు విజయవాడకే తరలిపోతుందా.. లేక ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌కు కేంద్రం తలొగ్గుతుందా.. అన్నది కాలమే నిర్ణయించాలి.